వాషింగ్టన్ : అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత వేవ్‌ల కంటే అమెరికాలో మూడు రెట్లు అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతుండగా, నిన్న ఒక్కరోజే 10 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండేండ్ల కాలంలో ఒకే రోజు ఇన్ని కేసులు ఏ దేశంలో కూడా నమోదు కాలేదు. అమెరికాలో గత నాలుగు రోజుల క్రితం 5,90,000 కేసులు నమోదు కాగా, నిన్నటికి ఆ సంఖ్య రెట్టింపు అయింది. కరోనా ఉధృతి నేపథ్యంలో అమెరికాలో స్కూళ్లు, కార్యాలయాలను మూసివేశారు. విమానాలను రద్దు చేశారు. కేసుల తీవ్రతతో ఆస్పత్రులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ అప్రమత్తమయ్యారు. ఈ వేరియంట్‌ను అడ్డుకోగలిగే చర్యలపై కరోనా వైరస్ రెస్పాన్స్ బృందాలతో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇవాళ సమీక్ష చేయనున్నట్లు యూఏఎస్ టుడే తెలిపింది.
అమెరికాలో ఇప్పటి వరకు 55 మిలియన్లకు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రతి ఆరుగురిలో ఒకరు కరోనా బారిన పడ్డారు. కరోనాతో 8,26,000 మంది చనిపోయినట్లు జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.