వాషింగ్టన్ : అమెరికాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు కొత్తగా రెండు రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. వీసాపై అమెరికాలో ఉండటంపై పరిమితులు రావచ్చు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ఎర్నింగ్స్‌పై పన్నుల భారం పడవచ్చు. ఎఫ్, జే, ఐ వీసాల అడ్మిషన్ పీరియడ్‌ను సవరించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ప్రతిపాదించింది. ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ నుంచి ‘ఫిక్స్డ్ టైమ్ పీరియడ్’కు మార్చాలని కోరింది. ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ అంటే, నాన్-ఇమిగ్రెంట్ స్టూడెంట్ స్టేటస్ ఉన్నంత వరకు వీసాదారులు అమెరికాలో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఫిక్స్డ్ టైమ్ పీరియడ్ అంటే, ఎఫ్-1 స్టడీ వీసా ఉన్న విద్యార్థుల వంటి నాన్-ఇమిగ్రెంట్స్ నిర్ణీత కాలం పూర్తయిన తర్వాత అమెరికా నుంచి వెళ్లిపోవలసి ఉంటుంది.
ఎఫ్, జే, ఐ క్యాటగిరీలలో నిర్ణీత సమయం కోసం అడ్మిట్ అయిన వారు ఈ నిర్ణీత గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో నివసించాలని కోరుకుంటే, యూఎస్సీఐఎస్కు దరఖాస్తు చేసి, పొడిగింపును కోరవచ్చు లేదా దేశం నుంచి వెళ్లిపోవచ్చు. అడ్మిషన్ కోసం సీబీపీకి ఏదైనా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద దరఖాస్తు చేయవచ్చు. చదువు పూర్తయిన తర్వాత, ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం అధీకృత సమయం కూడా పూర్తయిన తర్వాత ఎఫ్ వీసా గల స్టూడెంట్స్ అమెరికాను విడిచి వెళ్లడానికి 60 రోజుల గడువు ఉంటుంది. అమెరికాలో నివాసాన్ని కొనసాగించాలనుకుంటే, వీసా స్టేటస్‌ను మార్చాలని దరఖాస్తు చేయాలి. హెచ్-1బీ టెంపరరీ వర్కర్ లేదా సైన్స్, ఆర్ట్ లేదా బిజినెస్‌లో ఓ-ఎక్స్ట్రార్డినరీ ఎబిలిటీ క్యాటగిరీలో వీసా స్టేటస్‌ను కోరవచ్చు.
ఓపీటీ ట్యాక్సేషన్
ఓపీటీ ఫెయిర్ ట్యాక్స్ యాక్ట్ పేరుతో ఓ బిల్లును సెనేటర్ టామ్ కాటన్ ప్రవేశపెట్టారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ కింద పనిచేసే ఫారిన్ వర్కర్స్, వారిని నియమించుకునే కంపెనీల యజమానులు ఎఫ్ఐసీఏ (ఫెడరల్ ఇన్సూరెన్స్ కంట్రిబ్యూషన్స్ యాక్ట్) పన్నులను చెల్లించాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు యజమానులకు ఈ పన్నుల నుంచి మినహాయింపు ఉండేది. వృద్ధులు, దివ్యాంగులు వంటివారి కోసం సాంఘిక భద్రత కల్పించేందుకు ఈ పన్నులను విధిస్తారు. ప్రస్తుతం సాంఘిక భద్రత పన్ను రేటు ఉద్యోగులకు, యజమానులకు చెరొక 6.2 శాతం ఉంది. మెడికేర్ పన్ను రేటు ప్రస్తుతం ఉద్యోగులకు, యజమానులకు చెరొక 1.45 శాతం ఉంది. ఓపీటీ కింద పనిచేసే విదేశీ విద్యార్థులకు ప్రస్తుతం ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంది.