శాన్ఫ్రాన్సిస్కో: గూగుల్‌కు (Google) ఓపెన్ఏఐ (OpenAI) గట్టి సవాల్ విసిరింది. అత్యంత ప్రజాదరణ గల క్రోమ్ (Chrome) వెబ్ బ్రౌజర్‌కు పోటీగా అట్లాస్ వెబ్ బ్రౌజర్‌ను (Atlas) ఆవిష్కరించింది. ప్రస్తుతం యాపిల్ ల్యాప్‌టాప్‌ల కోసం అట్లాస్‌ను విడుదల చేసింది. త్వరలోనే విండోస్, ఐఫోన్లు, ఆండ్రాయిడ్ డివైస్ల కోసం విడుదల చేయనున్నట్లు తెలిపింది. బ్రౌజర్ ఎలా ఉండాలి? దానిని ఎలా ఉపయోగించుకోవాలి? అనే అంశాలను పునరాలోచించుకోగలిగే అరుదైన, దశాబ్దానికి ఒకసారి వచ్చే అవకాశంగా అట్లాస్‌ను ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ అభివర్ణించారు.
ఆయన ఇచ్చిన వీడియో ప్రజంటేషన్లో, సంప్రదాయ యూఆర్ఎల్ బార్ త్వరలోనే చాట్‌బాట్ ఇంటర్ఫేస్కు దారి చూపుతుందని, అది వెబ్‌ను సహజంగా నేవిగేట్ చేయడానికి యూజర్లకు ఉపయోగపడుతుందని తెలిపారు. ట్యాబ్స్ అద్భుతమేనని, అయితే, ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో బ్రౌజర్ ఇన్నోవేషన్ జరగలేదని పేర్కొన్నారు. అట్లాస్‌లోని ప్రీమియం ఫీచర్లలో ఒకటి ఏజెంట్ మోడ్ అని, అది మరింత అభివృద్ధి చెందినదని తెలిపారు.