బీజింగ్, మార్చి 11 : సంపదను, అదృష్టాన్ని తెచ్చి పెడతాయని ప్రచారం చేస్తూ ప్రధాన బ్యాంకుల బయట తవ్విన మట్టిని ‘బ్యాంకు మన్ను’ పేరిట చైనాలోని ఆన్లైన్ షాపులు అమ్మకం సాగిస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఈ వస్తువును రూ.10,500 ధరకు విక్రయిస్తున్నాయి. బ్యాంకుల బయట నుంచి, బ్యాంకు వరండాలలో ఉంచిన కుండీల నుంచి తీసిన మట్టితోపాటు డబ్బును లెక్కించే యంత్రాల వద్ద పడిన దుమ్మును కూడా సేకరించి విక్రేతలు అమ్ముతున్నట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది.
చైనాలోని ప్రధాన బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ చైనా, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కమ్యూనికేషన్స్ నుంచి సేకరించిన నాలుగు రకాల మట్టిని అమ్మకానికి ఉంచినట్టు ఆన్లైన్ విక్రేతలలో ఒకరు తెలిపారు. ఈ నాలుగు రకాలలో అత్యంత చవక మట్టి ధరను రూ. 260గా నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. తాము అమ్ముతున్న మట్టి నూటికి 99.99 శాతం సంపదను సృష్టించడంలో విజయం సాధించినట్టు మరో విక్రేత వెల్లడించారు.