కొవిడ్ మహమ్మారి పీడ ఇంకా విరుగుడు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇటీవలే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం అంటే 11 మిలియన్లకు పైగా కొవిడ్ -19 కేసులు పెరిగాయని వెల్లడించింది. చైనా, దక్షిణ కొరియా, యూకే, హాంకాంగ్ లాంటి దేశాల్లో కరోనా టెస్టుల సంఖ్య తగ్గినా.. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలిపింది. దీనికి కారణం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 అని స్పష్టం చేసింది.
ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న ఒమిక్రాన్ (Omicron) వెర్షన్లో రెండు సబ్ వేరియంట్లు బీఏ.1, బీఏ.2లున్నాయి. ఇందులో బీఏ.2 వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకూ మనం చూసిన సార్స్ సీఓవీ-2 వైరస్‌లోనే ఇది వేగంగా వ్యాప్తిచెందే సబ్ వేరియంట్ అని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. బీఏ.1తో పోల్చితే బీఏ.2 జన్యుక్రమం భిన్నంగా ఉందని తెలిపింది. అలాగే, ఈ రెండు సబ్ వేరియంట్ల స్పైక్ ప్రొటీన్స్లోని కొన్ని అమైనో యాసిడ్స్‌లో తేడాలున్నాయని నిపుణులు గుర్తించారు. అందువల్లే బీఏ.2 సబ్ వేరియంట్ నివురుగప్పిన నిప్పులా వ్యాపిస్తున్నదట. ఈ సబ్‌వేరియంట్ కారణంగా అమెరికాతోపాటు పశ్చిమ ఐరోపాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీన్ని బట్టిచూస్తే త్వరలోనే ఫోర్త్ వేవ్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సబ్ వేరియంట్ వ్యాప్తికి సంబంధించి ఐదు ఆధారాలు బలంచేకూరుస్తున్నాయి.
1. అమెరికాలో జనవరి ప్రారంభం నుంచి వెలుగుచూస్తున్న ఒమిక్రాన్ బీఏ.2 సబ్ వేరింట్ కేసుల వ్యాప్తిని
హెలిక్స్, శాన్ డియాగో ఆధారిత జెనోమిక్స్ సంస్థ పరిశీలిస్తోంది. ఈ సబ్‌వేరియంట్ వ్యాప్తి మొదట్లో నిదానంగా ఉంది. అయితే, ఇప్పుడు యూఎస్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో 50 శాతం నుంచి 70 శాతం వరకు ఈ సబ్ వేరియంట్‌కు సంబంధించినవే అని హెలిక్స్ అంచనా వేసింది. ఈ వార్తను బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
2. ఒమిక్రాన్ బీఏ.1కంటే బీఏ.2 సబ్‌వేరియంట్ 60శాతం ఎక్కువగా వ్యాపిస్తుందని వైట్‌హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ వెల్లడించారు. అయితే, ఇది మరింత తీవ్రంగా ఉన్నట్లు కనిపించడంలేదని పేర్కొన్నారు. కానీ వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు.
3. సకాలంలో టీకాలు ఇవ్వడం, చాలామందికి బూస్టర్ డోస్‌లు వేయడం వల్ల అతి ప్రమాదం నుంచి తప్పించుకున్నామని డాక్టర్ ఫౌసీ వెల్లడించారు. అయినా..చైనా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో బీఏ.2 సబ్ వేరియంట్.. కొవిడ్-19 కేసుల పెరుగుదలకు కారణమైందని చెప్పారు. ఆ దేశాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
4. ఒమిక్రాన్ బీఏ.1 సబ్‌వేరియంట్ కంటే బీఏ.2 వేరియంట్ 30శాతం మాత్రమే వ్యాపించగలదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు(డాక్టర్ ఫౌసీ మాత్రం 60శాతం ఎక్కువగా వ్యాప్తిచెందుతుందని అంచనా వేశారు). ఈ బీఏ.2 సబ్ వేరియంట్‌ను గుర్తించడం కష్టమని అంటున్నారు. అందుకే దీన్ని ‘స్టీల్త్ ఒమిక్రాన్’ అని పిలుస్తున్నారు.
5.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. బీఏ.2 జన్యుక్రమం బీఏ.1తో పోలిస్తే భిన్నంగా ఉంది. వీటి స్పైక్ ప్రోటీన్, ఇతర ప్రోటీన్లలో కొన్ని అమైనో ఆమ్ల వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. అందువల్ల బీఏ.2 సబ్ వేరియంట్ బీఏ.1కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నది. దీనిపై ఇంకా అధ్యయనాలు కూడా కొనసాగుతున్నాయి.
ఏది ఏమైనా ఫోర్త్ వేవ్ రాకుండా ఉండాలంటే ప్రజలంతా మళ్లీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని డబ్ల్యూహెచ్‌వోతోపాటు నిపుణులు కూడా సూచిస్తున్నారు. మాస్క్,శానిటైజర్ వాడకాన్ని కంటిన్యూ చేయాలని, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. అందరూ విధిగా టీకాలు వేసుకోవాలని చెబుతున్నారు.