Oman’s Silent Win : ఇరాన్, అమెరికా (Iran, USA) దేశాల మధ్య ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. రెండు దేశాలు రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ఒప్పందంలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. ఈ ఘర్షణతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధంలేని ఒమన్ (Oman) దేశం ఆర్థికంగా భారీగా లాభపడబోతున్నది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని తిరిగి తెరిచేందుకు కుదిరిన ఒప్పందంలోని ఓ నిబంధన ఒమన్‌కు కాసుల వర్షం కురిపించనుంది.
హర్మూజ్ జలసంధికి ఒకవైపు ఇరాన్ ఉండగా.. మరోవైపు ఒమన్ భూభాగమైన ముసందమ్ ద్వీపకల్పం ఉంది. తాజా ఒప్పందం ప్రకారం.. ఈ జలసంధి గుండా ప్రయాణించే ప్రతి నౌక నుంచి ఇరాన్‌తోపాటు ఒమన్ కూడా రవాణా రుసుము వసూలు చేస్తుంది. ఒక్కో నౌకపై సుమారు 2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.16.7 కోట్లు) వరకు వసూలు చేయనుండగా.. ఇందులో ఒమన్‌కు కూడా మంచి వాటా లభించనుంది. దాంతో ఒమన్ ఖజానాకు రోజూ వందల కోట్ల ఆదాయం వచ్చి చేరనుంది.
అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా నెలకొన్న వివాదాల్లో ఒమన్ తరచూ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వస్తున్నది. శాంతి చర్చల్లో కీలకపాత్ర పోషించినందుకు ప్రతిఫలంగానే ఇప్పుడు ఈ ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒప్పందంతో మధ్యప్రాచ్యంలో ఒమన్ వ్యూహాత్మక ప్రాధాన్యం మరోసారి రుజువైంది. అయితే ఈ టోల్ ఫీజు ఏర్పాటుపై కొన్ని దేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇరాన్, ఒమన్‌లు లాభపడినప్పటికీ ఈ అదనపు రుసుము భారం చివరికి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులపైనే పడుతుందని విమర్శిస్తున్నాయి.
మొత్తం మీద ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఇరాన్‌కు దాడుల నుంచి ఉపశమనాన్ని, అమెరికాకు చమురు రవాణాకు హామీని ఇచ్చింది. అయితే ఎలాంటి ఘర్షణలోనూ పాలుపంచుకోని ఒమన్‌కు మాత్రం ఊహించని రీతిలో భారీ ఆర్థిక లాభాన్ని తెచ్చిపెట్టింది. అందుకే అంతర్జాతీయ మీడియా దీనిని ‘ఒమన్ సైజ్ గెయిన్’ గా అభివర్ణిస్తోంది.