కీవ్ : రష్యన్ సైనికుల నుంచి లైంగిక దాడుల ముప్పును తప్పించుకునేందుకు ఉక్రెయిన్ పట్టణం ఇవాన్‌కివ్ బాలికలు తమ జుట్టును చిన్నగా కత్తిరించుకున్నారని డిప్యూటీ మేయర్ మరినా తెలిపారు. రాజధాని కీవ్‌కు 50 మైళ్ల దూరంలో ఉన్న ఈ పట్టణంలో బాలికలు రష్యన్ సైనికుల బారిన పడకుండా అందంగా కనిపించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆమె చెప్పారు.
నెలరోజుల పాటు రష్యన్ బలగాల చెరలో ఉన్న ఈ పట్టణం మార్చి 30న విముక్తి పొందింది. రష్యా స్వాధీనంలో ఉన్న సమయంలో పట్టణంలోని బేస్‌మెంట్స్‌లో తలదాచుకున్న మహిళలను జుట్టుపట్టుకుని బయటకు లాగిన రష్యన్ సైనికులు వారిపై వేధింపులకు తెగబడ్డారని మరినా పేర్కొన్నారు. దీంతో బాలికలు తమ జుట్టును పొట్టిగా కత్తిరించుకుని తమను ఎవరూ చూడకుండా ఉండటం మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు.
సమీప గ్రామంలోని 15, 16 సంవత్సరాల అక్కా చెల్లెళ్లపై రష్యన్ సైనికులు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. తన భర్తను కాల్చిచంపిన తర్వాత తన బిడ్డ ఏడుస్తుండగా తనపై రష్యన్ సైనికులు లైంగిక దాడికి పాల్పడ్డారని ఉక్రెయిన్ మహిళ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. పదేండ్ల చిన్నారులపైనా రష్యా సైనికులు లైంగిక దాడులకు పాల్పడ్డారని ఉక్రెయిన్ ఎంపీ లెసియా వసిలెంక్ పేర్కొన్నారు.