High Speed Internet | మెల్బోర్న్, నవంబర్ 12: హైస్పీడ్ ఇంటర్నెట్కు, ఊబకాయానికి సంబంధం ఉందంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. అధిక ఇంటర్నెట్ స్పీడ్తో ఊబకాయులు పెరుగుతున్నారని వీరు ఒక అధ్యయనంలో గుర్తించారు. మోనాష్ బిజినెస్ స్కూల్కు చెందిన పరిశోధకులు పలు సంవత్సరాల హౌజ్హోల్డ్, ఇన్కం అండ్ లేబర్ డైనమిక్స్ ఇన్ ఆస్ట్రేలియా(హెచ్ఐఎల్డీఏ) డాటాను విశ్లేషించి ఈ విషయాన్ని తేల్చారు.
2006 నుంచి 2019 మధ్యకాలంలో హైస్పీడ్ ఇంటర్నెట్ వినియోగం ఆస్ట్రేలియా వ్యాప్తంగా విస్తరించిందని, అదే విధంగా జనంలో నిశ్చల జీవనశైలి కూడా పెరిగిందని పరిశోధకుడు డాక్టర్ క్లాస్ అకెర్మాన్ తెలిపారు. అధిక స్పీడ్తో ఇంటర్నెట్ అందుబాటులో ఉండటం వల్ల ప్రజలు ఎక్కువ సమయం స్క్రీన్లకు అతుక్కుపోతున్నారని, ఫలితంగా వారిలో డబ్ల్యూహెచ్ఓ సూచించిన మేరకు శారీరక శ్రమ ఉండటం లేదని చెప్పారు. పైగా ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తూ ఉండటం వల్ల చిరుతిళ్లు ఎక్కువగా తింటున్నారని, దీంతో వారి కేలరీ ఇన్టేక్ పెరుగుతున్నదని తెలిపారు.