వాషింగ్టన్: అమెరికా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసి, పదేళ్లకుపైగా క్యూలో ఉన్న వారికి ఉపశమనం కల్పించాలని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రతిపాదించింది. 20,000 అమెరికన్ డాలర్లు (రూ.16.9 లక్షలు) చెల్లించినవారి దరఖాస్తును ఫాస్ట్‌ట్రాక్‌లో ప్రాసెస్ చేయాలని తెలిపింది. 2035నాటికి లీగల్ ఇమిగ్రేషన్ వీసా బ్యాక్‌లాగ్‌ను తొలగించాలని పేర్కొంది. 2023నాటి ప్రతిపాదనలను సవరించి డిగ్నిటీ యాక్ట్, 2025గా ఈ బిల్లును రిపబ్లికన్ మారియా ఎల్విరా సలజార్, డెమొక్రాట్ వెరోనికా ఎస్కోబార్ ప్రతిపాదించారు.
కుటుంబం స్పాన్సర్ చేసిన లేదా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ క్యాటగిరీలకు చెందిన అర్హులైన దరఖాస్తుదారులు పదేళ్లకుపైగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తూ ఉంటే, 20,000 డాలర్లు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును చెల్లించవచ్చు. ఇటువంటి దరఖాస్తులను స్టాండర్డ్ క్యూ కన్నా ముందుకు తీసుకొస్తారు. ఎంప్లాయ్మెంట్ బేస్డ్, ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్ కార్డుల కోసం దేశాల వారీగా పరిమితిని 7 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని ఈ బిల్లు ప్రతిపాదించింది.