Nude man in Flight : విమానంలో ఓ ప్రయాణికుడు హంగామా సృష్టించాడు. ఒంటిపై దుస్తులను తీసేసి ఫ్లైట్‌లో అటూఇటూ పరుగులు పెట్టాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఫ్లైట్ సిబ్బందిని ఫ్లోర్‌పై తోసిపడేసి మరి తన పరుగులు కొనసాగించాడు. సుమారుగా ఒక గంటపాటు ఆ ప్రయాణికుడు హైరానా చేశాడు. ఆస్ట్రేలియాకు చెందిన వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి వర్జిన్ ఆస్ట్రేలియా విమానం పెర్త్ నుంచి మెల్బోర్న్కు బయలుదేరింది. విమానం పెర్త్‌లో టేకాఫ్ అయిన కాసేపటికే స్టెర్లింగ్ అనే 23 ఏళ్ల ప్రయాణికుడు తన ఒంటిపై ఉన్న దుస్తులను విప్పేసి నగ్నంగా విమానంలో అటూ, ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు. విమాన సిబ్బంది గమనించి అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వాళ్లను తోసిపడేసి మరీ తన రన్నింగ్ కంటిన్యూ చేశాడు.
స్టెర్లింగ్ ప్రవర్తనలో తోటి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చివరకు విమానంలోని ఇద్దరు ఎయిర్ మార్షల్స్ అతడిని బంధించి చేతులకు బేడీలు వేశారు. అనంతరం విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించారు. విమానం పెర్త్‌లో ల్యాండ్ అయ్యే వరకు నిందితుడిని బంధించిపెట్టారు. విమానం ల్యాండైన తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. స్టెర్లింగ్ ప్రవర్తనతో విమానం టేకాఫ్ నుంచి తిరిగివచ్చి ల్యాండ్ అయ్యేవరకు మూడున్నర గంటల సమయం వృథా అయ్యింది. వర్జిన్ ఆస్ట్రేలియా యాజమాన్యం ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.