Iran Conflict : పశ్చిమాసియాలో ఇరాన్ (Iran) తో అమెరికా, ఇజ్రాయెల్ (US, Israel) దేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఇరాన్ కేంద్రంగా కొనసాగుతున్న యుద్ధం విషయంలో సౌదీ అరేబియా (Saudi Arabia) ఒక విచిత్రమైన వైఖరిని అవలంబిస్తోంది. సౌదీ పైకి శాంతిని కోరుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఈ వివాదం ఇప్పుడప్పుడే ముగియకూడదని, కొనసాగడమే తమకు ప్రయోజనకరమని భావిస్తున్నది. దీన్నే నిపుణులు ‘వ్యూహాత్మక నిరీక్షణ’ అని విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం ఇరాన్ తన పూర్తి సైనిక, దౌత్య శక్తిని ఇజ్రాయెల్, అమెరికాలతో పోరాటంపైనే కేంద్రీకరించింది. ఈ పరిస్థితి పశ్చిమాసియాలో తన రాజకీయ, ఆర్థిక ప్రభావాన్ని పెంచుకోవడానికి సౌదీ అరేబియాకు అనుకూలంగా మారింది. ప్రత్యర్థి అయిన ఇరాన్ బలహీనపడటం ద్వారా ప్రాంతీయంగా ఆధిపత్యం చెలాయించేందుకు సౌదీకి అవకాశం దొరుకనుంది. మరోవైపు యుద్ధ మేఘాల కారణంగా ముడి చమురు ధరలు అధిక స్థాయిలో స్థిరంగా ఉండటం చమురు ఎగుమతులపై ఆధారపడిన సౌదీ ఆర్థిక వ్యవస్థకు కలిసివస్తున్నది.
ఒకవేళ శాంతి నెలకొంటే ధరలు తగ్గే ప్రమాదం ఉంటుంది. అది ఒక రకంగా సౌదీకి నష్టం. అదే సమయంలో ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందన్న కారణంతో సౌదీ ఇప్పుడు అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు, రక్షణ హామీలను పొందుతున్నది. ఈ వివాదం కొనసాగినంత కాలం తనకు ఇలాగే అమెరికా అండ ఉంటుందని సౌదీ భావిస్తోంది. నిజానికి ఇరాన్ పూర్తిగా నాశనం కావడాన్ని గానీ లేదా అది మరింతగా బలపడటాన్ని గానీ సౌదీ కోరుకోవడం లేదు.
ఈ రెండూ కాకుండా ఒక ‘నియంత్రిత ఉద్రిక్తత’ కొనసాగాలని సౌదీ ఆశిస్తున్నది. తన ప్రతిష్ఠాత్మక ‘విజన్ 2030’ లక్ష్యాల సాధనకు స్థిరత్వం అవసరమని చెబుతున్నా, ఇరాన్ కష్టాల్లో ఉండటం ద్వారా లభించే రాజకీయ ప్రయోజనాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ క్రమంలో సౌదీ వైఖరి ‘యుద్ధం వద్దు.. కానీ శాంతి అంతకంటే వద్దు’ అన్నట్లుగా ఉన్నది.