న్యూఢిల్లీ: ఉత్తర కొరియా(North Korea) కొత్త యుద్ధ నౌకను ఆవిష్కరించింది. ఆ నౌక సుమారు అయిదు వేల టన్నుల బరువు ఉన్నది. బహుళ ప్రయోజనాలు కలిగిన ఆ యుద్ధనౌకను ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ఆవిష్కరించారు. ఆ నౌకలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. కేవలం 400 రోజుల్లోనే ఆ యుద్ధనౌకను నిర్మించినట్లు వర్కర్స్ పార్టీ కార్యదర్శి జో చున్ రియాంగ్ తెలిపారు. త్వరలోనే ఆ నౌకను నేవీకి అప్పగించనున్నట్లు కిమ్ వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి ఆ నౌక సర్వీస్‌లోకి రానున్నది.
నాంపోలో ఉన్న షిప్‌బిల్డింగ్ డాక్‌యార్డులో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. చోయి హయన్ క్లాస్ షిప్‌గా దీన్ని నిర్మించారు. జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడిన నేత చోయి హయన్ పేరు మీద ఈ నౌకను నిర్మించారు. భారీ సంఖ్యలో క్షిపణులను మోసుకెళ్లే రీతిలో యుద్ధనౌకను రూపొందించారు. దేశంలో భద్రతా సమస్య సీరియస్‌గా ఉన్నట్లు కిమ్ పేర్కొన్నారు. కొత్త డెస్ట్రాయర్‌ను డెవలప్ చేసిన వర్కర్లు, టెక్నీషియన్లకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. అమెరికా తన ఆయుధాలను వ్యూహాత్మకంగా తమ ప్రాంతంలో మోహరిస్తున్న నేపథ్యంలో యుద్ధనౌకను డెవలప్ చేసినట్లు కిమ్ చెప్పారు.