సియోల్: ఉత్తర కొరియా కొత్తగా సూసైడ్ డ్రోన్ల(suicide drones)ను తయారు చేస్తున్నది. ఆ డ్రోన్లను ఇటీవల పరీక్షించారు. ఆ సమయంలో ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్.. డ్రోన్ పరీక్షను ప్రత్యక్షంగా సమీక్షించారు. మిలిటరీని బలోపేతం చేసేందుకు ఇలాంటి ఆయుధాలను అభివృద్ధి చేయనున్నట్లు కిమ్ జాంగ్ ఉన్ తెలిపారు. సూసైడ్ డ్రోన్లకు చెందిన ఫోటోలను రిలీజ్ చేశారు. తెలుపు రంగు డ్రోన్‌కు.. ఎక్స్ ఆకారంలో ఉన్న టెయిల్ ఉన్నది. కే2 యుద్ధ ట్యాంక్‌ను ఆ డ్రోన్ పేల్చినట్లు తెలుస్తోంది. శనివారం రోజున ఈ పరీక్ష జరిగినట్లు మీడియా పేర్కొన్నది.
సూసైడ్ డ్రోన్ పరీక్ష గురించి కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటన చేసింది. వేర్వేరు రేంజెస్‌లో టార్గెట్లను ధ్వంసం చేసే డ్రోన్లను ఉత్తర కొరియా తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భూమి, సముద్రం మీద ఉన్న టార్గెట్లను ఆ డ్రోన్లతో పేల్చనున్నారు. ఆధునిక యుద్ధం, సైనిక సాంకేతికలో వస్తున్న మార్పులకు తగినట్లు డ్రోన్లను సిద్దం చేయాల్సి ఉందని కిమ్ తెలిపారు. వీలైనంత త్వరగా ఆధునిక డ్రోన్లను మిలిటరీలో చేర్చనున్నట్లు చెప్పారు. ఇన్ఫాంట్రీ, స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్లు ఈ డ్రోన్లను వాడే అకాశం ఉన్నది.