హైదరాబాద్ : కొత్త తరహా హైటెక్ ఆయుధాలను ఉత్తర కొరియా(North Korea) పరీక్షిస్తున్నది. ఇందులో భాగంగా అమెరికా, దక్షిణ కొరియా రక్షణ వ్యవస్థలను ఛేదించేందుకు తన సామర్థ్యాలను విస్తరించుకునే ప్రయత్నంలో ఉత్తర కొరియా క్లస్టర్ బాంబు వార్హెడ్లతో కూడిన పలు స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను చేపట్టిందని, ఈ నెలలో ఇది నాలుగో పరీక్ష కాగా, ఈ ఏడాదిలో ఏడవదని ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్ఏ(KCNA) సోమవారం ప్రకటించింది.
దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రయోగాల ముఖ్య ఉద్దేశం వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణికి అమర్చిన క్లస్టర్ బాంబు వార్‌హెడ్, ఫ్రాగ్మెంటేషన్ మైన్ వార్హెడ్ల పనితీరును ధ్రువీకరించేందుకు అని కేసీఎన్ఏ తెలిపింది. కేసీఎన్ఏ ప్రకారం, క్లస్టర్ బాంబు వార్హెడ్లు , ఫ్రాగ్మెంటేషన్ మైన్ వార్హెడ్లతో కూడిన ఐదు ఆధునీకరించిన ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే హ్వాసాంగ్-11 రా బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించారు. సుమారు 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించేలా వీటిని రూపొందించారు.