ప్యోంగ్యాంగ్: షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణుల(Ballistic Missiles)ను పరీక్షించింది ఉత్తర కొరియా. ఇవాళ ఉదయం పలు మిస్సైళ్లను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా మిలిటరీ పేర్కొన్నది. అయితే మే నెల తర్వాత మళ్లీ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆ క్షిపణుల పరీక్షపై బ్యాన్ ఉన్న విషయం తెలిసిందే. మరో వైపు వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మియింగ్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష నిర్వహించడం అందోళనకరంగా మారింది. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ మీటింగ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోనూ ట్రంప్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ సమీపం నుంచి ఇవాళ పలు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించినట్లు దక్షిణ కొరియా గుర్తించింది. ఉత్తర కొరియా పరీక్షించిన మిస్సైల్స్‌ను ట్రాక్ చేసినట్లు దక్షిణ కొరియా మిలిటరీ పేర్కొన్నది. ఆ ప్రొజెక్టైల్స్ సుమారు 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు సౌత్ కొరియా మిలిటరీ వెల్లడించింది. భూమిపైనే ఆ క్షిపణులు పడినట్లు గుర్తించారు. ఉత్తర కొరియా పరీక్షల గురించి అమెరికా, జపాన్‌కు సమాచారాన్ని చేరవేసినట్లు సౌత్ కొరియా చెప్పింది.