సియోల్: ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని (ballistic missile) ప్రయోగించింది. ఈ క్షిపణిని తమ తూర్పు జలాల వైపు ప్రయోగించినట్లుగా గుర్తించినట్లు దక్షిణ కొరియా ఆర్మీ తెలిపింది. అది ఏ క్షిపణి, ఎంత దూరం ప్రయాణించింది అన్నది దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించలేదు. అయితే ఉత్తర కొరియా ప్రయోగించిన మిస్సైల్ తమ ఈఈజెడ్ వెలుపల ల్యాండ్ అయ్యిందని జపాన్ తెలిపింది. బాలిస్టిక్ క్షిపణిగా అనుమానించింది. రాయిటర్స్ వార్తా సంస్థ ఈ విషయాన్ని పేర్కొంది.
కాగా, ఇటీవల జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఉత్తర కొరియా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తన ఆయుధాలను ప్రదర్శిస్తోంది. అమెరికా భూభాగానికి చేరే సామర్థ్యం ఉన్న రెండు ఖండాతర క్షిపణులను కూడా ఉత్తర కొరియా ఈ ఏడాది ప్రయోగించింది. అలాగే దక్షిణ కొరియాలోని లక్ష్యాలకు అనుగుణంగా అణు దాడుల సంసిద్ధతను కూడా పరీక్షించింది. ఈ నేపథ్యంలో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
మరోవైపు ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిషేధించింది. ఈ మేరకు పలు తీర్మానాలు చేసింది. అయితే తన సార్వభౌమ హక్కును కాపాడుకునేందుకు ఆత్మరక్షణ కోసం క్షిపణి ప్రయోగాలు చేస్తున్నట్లు ఉత్తర కొరియా సమర్థించుకుంది.