Nobel Prize | లిటరేచర్‌లో దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్ పురస్కారం దక్కింది. సాహిత్యంలో ఆమె చేసిన విశేష కృషికి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సెస్ 2024 సంవత్సరానికి గాను నోబెల్‌ను ప్రకటించింది. గతేడాది నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసెకు నోబెల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాన్ని ఆమె తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టినట్లుగా రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది. బుధవారం కెమిస్ట్రీ రంగంలో చేసిన కృషికి ఈ ఏడాది ముగ్గురికి ఈ గౌరవం దక్కింది.
డేవిడ్ బేకర్‌కు కంప్యూటేషనల్ ప్రొటీన్ డిజైన్, ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్లో డెమిస్ హస్సాబిస్, జాన్ ఎం జంపర్లకు సంయుక్తంగా నోబెల్‌ను ప్రకటించారు. జాన్ జే హాప్ఫీల్డ్, జియోఫ్రీ ఈ హింటన్లో భౌతికశాస్త్రంలో చేసిన కృషికి నోబెల్ దక్కింది. వైద్యరంగంలో చేసిన కృషికి విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు సంయుక్తంగా నోబెల్‌ను ప్రకటించారు.
మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్నందుకు ఇద్దరికీ నోబెల్ ఇచ్చారు. తాజాగా సాహిత్యరంగానికి నోబెల్‌ను ప్రకటించారు. ఇక శుక్రవారం నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించనున్నారు. ఆర్థిక రంగంలో నోబెల్‌ను ఈ నెల 14న ప్రకటించనున్నారు. నోబెల్ పురస్కారం అందుకున్న వారికి మిలియన్ డాలర్ల నగదు పారితోషకం అందించనున్నారు. 1896లో మరణించిన అవార్డు వ్యవస్థాపకుడు, స్వీడిష్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం 1904లో నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తూ వస్తున్నారు.
మొదట భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన వారికి ఏటా నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే, 1963 నుంచి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ నుంచి ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం ఆర్థికశాస్త్రంలో కృషి చేసిన వారికి సైతం నోబెల్‌కు ఎంపిక చేయడం జరుగుతున్నది. పురస్కారాలను డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు ప్రదానం చేయనున్నారు.