బుడాపెస్ట్, జూన్ 22: ప్రపంచ జనాభా నానాటికీ పెరిగిపోతున్నప్పటికీ కొన్ని దేశాల్లో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతున్నది. అలాంటి దేశాల్లో హంగరీ ఒకటి. వివాహాలను ప్రోత్సహించడం ద్వారా దేశ జనాభాను పెంచేందుకు హంగరీ ప్రధాని విక్టర్ ఒర్బన్ వినూత్న చర్యలు చేపట్టారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు జీవితాంతం ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదని శుక్రవారం ప్రకటించారు.
జనాభాను పెంచుకునేందుకు వలసదారులను ఆహ్వానించాల్సి వస్తుండటంతో తాము విభిన్న ఆలోచనలతో ముందుకొచ్చామని తెలిపారు. కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనే మహిళలకు ఆదాయ పన్నులో జీవితకాల మినహాయింపు ఇస్తామన్నారు. పెద్ద కుటుంబాలు పెద్ద కార్లను కొనుగోలు చేసుకునేందుకు సబ్సిడీ ఇస్తామని, పిల్లల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 21 వేల శిశు సంరక్షణ కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. వివాహాలను, జననాల రేటును పెంచేందుకు హంగరీ ప్రభుత్వం 2019లో మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం కింద 41 ఏండ్లలోపు వయసులో పెండ్లి చేసుకున్న మహిళలకు సబ్సిడీపై కోటి ఫోరింట్స్ (దాదాపు రూ.27.57 లక్షల) రుణం ఇవ్వనున్నట్టు ప్రకటించింది.