వాషింగ్టన్, జూలై 24: భారత్ వంటి పరాయి దేశాల నుంచి ఉద్యోగులను నియమించుకోవడం ఇక ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు స్పష్టంచేశారు. వాషింగ్టన్లో బుధవారం నిర్వహించిన ఏఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. టెక్ కంపెనీలు ఇక మీదట అమెరికన్లపై దృష్టి పెట్టాలని చెప్పారు. అమెరికన్ కంపెనీలు చైనాలో పరిశ్రమలు పెట్టి, భారతీయ టెకీలకు ఉద్యోగాలు ఇవ్వడానికి బదులుగా స్వదేశంలోనే మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దృష్టి పెట్టాలని అన్నారు. టెక్ కంపెనీల ‘ప్రాపంచిక దృక్పథాన్ని’ ఆయన విమర్శించారు. ఈ దృక్పథం వల్ల అమెరికన్లు నిర్లక్ష్యానికి గురవుతున్నారని అన్నారు.
అమెరికా ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకొని కొన్ని పెద్ద కంపెనీలు భారీగా లాభాలు ఆర్జించాయని కానీ ఆ సొమ్మును దేశం వెలుపల పెట్టుబడిగా పెట్టాయని ఆరోపించారు. ‘ట్రంప్ పాలనలో ఇక ఆ రోజులు అంతరించిపోయాయి’ అని హెచ్చరించారు. చైనాలో పరిశ్రమలు పెట్టి, భారతీయులకు ఉద్యోగాలిచ్చి, తమ లాభాలను ఐర్లాండ్లో పెట్టుబడులుగా పెడుతున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలో తోటి అమెరికన్ పౌరులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమని చెప్పారు. అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలన్నీ అమెరికన్ల కోసమే పనిచేయాలని, వాటి మొదటి ప్రాధాన్యం అమెరికానే ఉండాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏఐకి సంబంధించిన మూడు ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారు.