Nischa Shah | లండన్ : చాలా మందికి రోజూ ఒకే పని చేయాలంటే చిరాగ్గా ఉంటుంది. ప్రతి క్షణం కొత్తగా ఉండాలని కోరుకుంటారు. అలాంటివారిలో ఒకరైన నిశ్చా షా యూట్యూబర్‌గా సంచలనం సృష్టిస్తున్నారు. పదేండ్ల పాటు లండన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా పనిచేసిన ఆమె సంవత్సరానికి రూ.2 కోట్లు ఆర్జించేవారు. కానీ తన కెరీర్ అర్థవంతంగా లేదని, కొత్తగా ఏదో సాధించాలని తపన పడ్డారు. బ్యాంకింగ్ రంగంలో తాను కేవలం కార్పొరేషన్లకు, ప్రభుత్వాలకు మాత్రమే సహాయపడుతున్నానని, ఇంకా ఎక్కువ మందికి తన వల్ల ప్రయోజనం కలగాలని ఆకాంక్షించారు.
ఈ నేపథ్యంలో 2023 జనవరిలో ఉద్యోగాన్ని వదిలేసి, పర్సనల్ ఫైనాన్స్‌లో ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేటర్‌గా మారారు. అప్పటి నుంచి ఈ ఏడాది మే నెల వరకు రూ.8 కోట్లు సంపాదించారు. యూట్యూబ్ మానెటైజేషన్ ఆదాయం, కోర్సులు, ప్రొడక్ట్స్ అమ్మడం, కార్పొరేట్ చర్చలు నిర్వహించడం, ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామి కావడం ద్వారా ఈ సొమ్మును సంపాదించారు. ఈ ఘనత గురించి నిశ్చా షా మాట్లాడుతూ, తాను బ్యాంకింగ్‌లో ఉన్నప్పటి కన్నా ఇప్పుడు ఎక్కువగా సంపాదిస్తున్నానని చెప్పారు.
ఇప్పుడు డబ్బు వెంట పరుగులు తీయకుండా, కేవలం తనకు నచ్చినదానిని, తనకు ఇష్టమైనదానిని చేయడం ద్వారా సంపాదిస్తున్నానని చెప్పారు. ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత తొమ్మిది నెలలపాటు జీవించడానికి తగిన సొమ్మును భద్రపరిచానని తెలిపారు. తన యూట్యూబ్ చానల్‌కు ప్రజాదరణ అంత తేలికగా లభించలేదని… 1,000 మంది సబ్‌స్ర్కైబర్లు రావడానికి 11 నెలలు పట్టిందని తెలిపారు. 2022 సెప్టెంబరులో తన జీవితం గురించి చేసిన వీడియో వైరల్ అవడంతో సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 50 వేలకు చేరుకుందని చెప్పారు. ప్రస్తుతం తన వీడియోలకు 1 లక్ష నుంచి 90 లక్షల వీక్షణలు వస్తాయని సంతోషం వ్యక్తం చేశారు.
సైడ్ బిజినెస్ సక్సెస్ చేసుకోండిలా…
కొత్తగా ఏదైనా సాధించాలని కోరుకునేవారికి నిశ్చా షా చక్కని సలహాలు ఇచ్చారు. బ్యాక్అప్ ఇన్కమ్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. పొదుపు చేసిన సొమ్ము అంతా ఒకేసారి ఖర్చయిపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎటువంటి పర్యవసానాలు లేకుండానే, ఇతర విషయాలను తెలుసుకోగలిగే ఉద్యోగం చేయాలని సలహా ఇచ్చారు. ఇష్టమైనదానిని విజయవంతంగా చేయాలంటే, స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగం ఉండాలని సూచించారు. ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేయడం వల్ల ఆర్థిక భద్రత లభిస్తుందన్నారు. ఎమర్జెన్సీ ఫండ్‌ను భద్రపరచుకుని, సైడ్ బిజినెస్‌ను సక్సెస్ చేసుకోవచ్చునన్నారు.