బుచారెస్ట్ : రొమేనియా కొత్త దేశాధ్యక్షుడిగా నికోసర్ డాన్(Nicusor Dan) ఎన్నికయ్యారు. ఆ దేశ రాజధాని బుచారెస్ట్ మేయర్‌గా ఆయన చేశారు. రైట్ వింగ్ జాతీయవాది జార్జ్ సిమిన్ నుంచి ఆయన గట్టి పోటీ ఎదుర్కొన్నారు. యురోపియన్ యూనియన్‌కు అనుకూల వ్యక్తి. ఉక్రెయిన్‌కు కూడా ఆయన సపోర్టు ఇస్తున్నారు. స్వయంగా ఆయనో గణిత మేధావి. దేశంలో అవినీతి, వ్యవస్థీకృత నేరాలను అంతం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. తాజాగా ముగిసిన దేశాధ్యక్ష ఎన్నికల్లో నికోసర్ డాన్‌కు 53.6 శాతం ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో సిమిన్ ఫెవరేట్‌గా భావించారు. కానీ ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన సర్ప్రైజ్ ఇచ్చారు. రొమేనియాలో కొత్త అధ్యాయం మొదలైందని, ప్రతి ఒక్కరు దాంట్లో భాగస్వామ్యులు కావాలని డాన్ తన విజయ ప్రసంగంలో పేర్కొన్నారు. వివిధ ప్రజా పాలసీల్లో నిపుణులు భాగస్వామ్యం కావాలన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా రొమేనియాను పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
1969లో ఫగారస్ అనే పట్టణంలో నికోసర్ డాన్ జన్మించారు. చిన్నప్పటి నుంచి గణితశాస్త్రం అంటే ఆయనకు ఇష్టం. స్కూల్, అకాడమిక్స్‌లో ఉత్తమ శ్రేణి సాధించేవారు. 1980 దశకంలో అతను అంతర్జాతీయ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు గెలిచారు. 1998లో పారిస్‌లోని ప్రతిష్టాత్మక సోర్బోర్నే యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో డాక్టరేట్ పొందారు. పారిస్ వర్సిటీలో రొమేనియా విద్యార్థులతో దేశం గురించి చర్చించేవాళ్లమన్నారు. రొమేనియా అకాడమీలో గణితశాస్త్ర పరిశోధకుడిగా పనిచేశారు. సేవ్ బుచారెస్ట్ అసోసియేషన్‌తో ఆయన పౌరకార్యకర్తగా మారారు. హరిత ప్రదేశాల్లో అక్రమంగా నిర్మించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ఆయన వ్యతిరేకించారు. గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. అవినీతి వ్యతిరేక పోరాటం కూడా చేశారు. సేవ్ రొమేనియా యూనియన్ పార్టీని స్థాపించారు. 2020లో బుచారెస్ట్ మేయర్ అయ్యారు.