న్యూయార్క్: ఇది చదివి పత్రికల సర్క్యులేషన్ భారీగా పెరిగిపోయిందని అనుకుంటే పొరపాటే. కరోనా కారణంగా అన్ని రంగాల్లాగే పత్రికా రంగం కూడా ఎంతలా కుదేలైందో చెప్పే వార్త ఇది. ఈ మహమ్మారి వల్ల పత్రికలకు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఈ రెవెన్యూ ఎంతలా పతనమైందంటే.. 2020లో తొలిసారి పత్రిక సర్క్యులేషన్ ఆదాయం కూడా దీని కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. తాజాగా ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్క్యులేషన్ రెవెన్యూ అంటే ప్రజలు పత్రికలు, డిజిటల్ చందాలను కొనడం ద్వారా వచ్చే ఆదాయం. ఇది 2020లో ప్రపంచవ్యాప్తంగా 1110 కోట్ల డాలర్లుగా ఉంది. అదే సమయంలో వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయం మాత్రం కేవలం 880 కోట్ల డాలర్లు మాత్రమే.
యాడ్ రెవెన్యూ ఎంత దారుణంగా పడిపోయిందో చెప్పడానికి ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. 2006లో అంటే అప్పుడప్పుడే పత్రికల నుంచి యాడ్ రెవెన్యూను ఇంటర్నెట్ లాక్కుంటున్న సమయంలో న్యూస్పేపర్స్కు యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయం 4930 కోట్ల డాలర్లు. 2006లో ఎంత సర్క్యులేషన్ ఉందో ఇప్పుడూ దాదాపుగా అంతే ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఒక రోజు పత్రికల సర్క్యులేషన్ తాజాగా 2.43 కోట్లుగా ఉన్నట్లు ప్యూ వెల్లడించింది. అదే 20 ఏళ్ల కిందట ఇది 5.78 కోట్లుగా ఉండేది.