వెల్లింగ్టన్: భూమిపై ఇప్పటివరకు సంచరించిన అత్యంత ఎత్తయిన పక్షికి పునరుజ్జీవం పోసేందుకు ఓ అమెరికా స్టార్టప్ ప్రయత్నిస్తోంది. 600 ఏండ్ల క్రితం న్యూజిలాండ్‌లో తిరుగాడిన 12 మీటర్ల ఎత్తయిన దక్షిణ ద్వీప దిగ్గజ ‘మోవా’ పక్షిని ప్రపంచంలోనే ఎత్తయిన పక్షిగా పరిగణిస్తారు. ఇప్పుడు కొలొస్సల్ బయోసైన్సెస్ సంస్థ జన్యుపర ఇంజినీరింగ్ ద్వారా ఈ పక్షిని మళ్లీ పుట్టించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకోసం ఈ స్టార్టప్‌కు 15 మిలియన్ డాలర్ల నిధులను లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సంచాలకులు సర్ పీటర్ జాక్సన్ సమకూర్చారు.
పొలీనిసియన్ సెటిలర్లు సుమారు 600 ఏండ్ల క్రితం న్యూజిలాండ్‌కు వచ్చిన ఒక శతాబ్దానికి మోవా పక్షులు అంతరించిపోయాయి. ఈ పక్షికి రెక్కలు కాని, వృద్ధి చెందే అవయవ నిర్మాణం కాని ఉండేది కాదని కొలొస్సల్ బయోసైన్సెస్ చెప్తోంది. ఇలాంటి పక్షిని తిరిగి పుట్టించడం చిన్న సాహసమేమీ కాదని చెప్పింది. యూనివర్సిటీ ఆఫ్ కాంటర్బర్ సహకారంతో 5-10 ఏండ్ల లోపు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఆ సంస్థ భావిస్తున్నది.