న్యూయార్క్: కరోనా ఆంక్షలన్నింటినీ ఎత్తేయడాన్ని కూడా ప్రజలు పండగలాగా జరుపుకుంటున్నారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం కరోనా ఆంక్షలన్నీ ఎత్తేసింది. తమ రాష్ట్రంలో 70 శాతం మంది వయోజనులు కనీసం ఒక డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ కువోమో వెల్లడించారు. ఆంక్షలు తొలగిపోవడంతో ప్రజలు పటాకులు కాల్చి పండగ చేసుకున్నారు. ఇది చెప్పుకోదగిన మైలురాయి అని, తాము మరింత చేస్తామని ఈ సందర్భంగా కువోమో చెప్పారు. వాణిజ్య, సామాజిక పరంగా ఉన్న ఆంక్షలన్నింటినీ వెంటనే ఎత్తేస్తున్నట్లు మంగళవారం న్యూయార్క్ గవర్నర్ ప్రకటించారు.
అయితే అమెరికా సీడీసీ సూచనల మేరకు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు మాత్రం కొనసాగుతాయని చెప్పారు. థియేటర్లలో 100 మంది, జిమ్లలో 33 శాతం, రిటెయిల్ షాపులలో 50 శాతం సామర్థ్యం మాత్రమే ఉండాలన్న పారిశ్రామిక సంబంధిత ఆంక్షలను ఎత్తేశారు. వ్యాపారాలలో వ్యాక్సిన్లు వేసుకున్న వ్యక్తులు మాస్కులు పెట్టుకోవడం, ఆరు అడుగుల దూరం పాటించడం చేయాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ వేసుకోని వాళ్లు మాత్రం వీటిని కొనసాగించాలి.
గతేడాది కరోనా వైరస్ తొలిసారి వెలుగు చూసినప్పుడు అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. అలాంటిది ఇప్పుడు మహమ్మారిని విజయవంతంగా కట్టడి చేసిన ఆ రాష్ట్రం మంగళవారాన్ని ఓ చిరస్మరణీయ రోజుగా జరుపుకుంది. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్తోపాటు రాష్ట్రమంతా పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
The iconic Empire State Building and other landmarks in New York were lit up in blue and gold as Governor Andrew Cuomo lifted all restrictions https://t.co/uPwI0PkGdU pic.twitter.com/519APio97D
— Reuters (@Reuters) June 16, 2021