లండన్, జూలై 19: ఇంగ్లండ్‌లో కరోనా కేసులు తగ్గి ఆంక్షలు సడలించిన వేళ మరో వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. ఇంగ్లండ్‌లో ఐదు వారాల్లో 154 మంది నోరోవైరస్ బారిన పడ్డారు. వేగంగా వ్యాపించే గుణం ఉన్న ఈ వైరస్ సోకితే కడుపు నొప్పి, డయేరియా, వాంతులు, జ్వరం వస్తా యి. ముఖ్యంగా కడుపుపై దీని ప్రభావం అధికంగా ఉండటం వల్ల దీన్ని వాంతిని కలిగించే సూక్ష్మజీవి అని అంటారు. జ్వరాన్ని స్టొమక్ ఫ్లూ అంటారు. కలుషిత ఆహారం, నీరు, కలుషిత ప్రదేశాల్లో నోరో వైరస్ ఉంటుంది. కలుషితాహారం తీసుకొన్నప్పుడు శరీరంలో చేరి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. వైరస్ సోకిన వారి నుంచి కూడా వ్యాపిస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు రెండు, మూడు రోజులు ఉంటాయి. ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే కోలుకొంటారు. వృద్ధులు, పిల్లల్లో డీ హైడ్రేషన్ సంభవించవచ్చు. ఆ సందర్భం లో చికిత్స అవసరం పడొచ్చు.