ఢాకా, జనవరి 2: బంగ బంధుగా పేరొందిన మాజీ ప్రధాని షేక్ హాసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ ఆనవాళ్లను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం ఒక్కొక్కటిగా చెరిపేస్తున్నది. ఇటీవల కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాన్ని తొలగించిన సర్కారు.. తాజాగా చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ఆయన దేశ స్వాతంత్య్ర ప్రకటన చేయలేదని పేర్కొంది. ఆయనకు ఉన్న జాతిపిత గౌరవ బిరుదును తొలగించింది. ది డైలీ స్టార్ కథనం ప్రకారం.. 2025 విద్యా సంవత్సరానికి గాను ప్రాథమిక, సెకండరీ విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో పలు మార్పులు చేశారు.
వాటిలో పేర్కొన్న ప్రకారం… మార్చి 26, 1971న ఆర్మీ మేజర్ జియాఉర్ రెహ్మాన్ బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ప్రకటన చేశారు. ఆ మరుసటి రోజు బంగబంధు తరపున ఆయన మరోసారి స్వాతంత్య్ర ప్రకటన చేశారు. గత ప్రభుత్వాలు అతిశయోక్తితో కూడిన చరిత్రను విద్యార్థులపై రుద్దాయని కొత్త పాఠ్య పుస్తకాల రచయిత, పరిశోధకుడు రఖాల్ రహా విమర్శించారు. ముజిబుర్ రెహ్మాన్ హత్యకు గురైన ఆగస్టు 15న ఉన్న జాతీయ సెలవును తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది.