వాషింగ్టన్, సెప్టెంబర్ 21 : హెచ్-1బీ వీసాలపై భారతీయ, అంతర్జాతీయ నిపుణుల పరిస్థితిని సమూలంగా మార్చే కొత్త అణచివేత కార్యక్రమం ప్రాజెక్టు ఫైర్వాల్కు అమెరికా శ్రీకారం చుట్టింది. అమెరికాయే ఫస్ట్ నినాదం కింద చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కార్మిక శాఖ నిర్వహిస్తుంది. హెచ్-1బీ వీసాలను దుర్వినియోగం చేస్తున్నట్టు, విదేశీ ఉద్యోగులను, ముఖ్యంగా భారత దేశానికి చెందిన వారి పట్ల అనుకూలంగా ఉన్నట్టు అనుమానిస్తున్న యజమానులు లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం కింద హెచ్-1బీ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేసినట్టు గుర్తించిన యజమానులపై జరిమానాలు, తాత్కాలిక నిషేధాలు విధిస్తారని లేబర్ సెక్రటరీ లోరి చావెజ్ డిరిమర్ ్ల చెప్పారు.
తమ ఉద్యోగుల ఖర్చుతో ఏ యజమానులు హెచ్-1బీ వీసాలను దుర్వినియోగం చేయకుండా చూసుకోవడానికి ప్రాజెక్టు ఫైర్వాల్ సహాయపడుతుందని అన్నారు. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు ముందుగా అమెరికన్లకే వెళ్లాలి అన్న తమ నిర్ణయానికి ఇది కృషి చేస్తుందని తెలిపారు. కాగా, ఈ కొత్త నిబంధనలు ఇప్పటివరకు మొత్తం హెచ్-1బీ వీసాల్లో 71 శాతం పొందుతున్న భారతీయులకు కష్టాలు తెచ్చిపెడతాయనడంలో సందేహం లేదు. అంతేకాకుండా భవిష్యత్లో కరెంట్ పర్మిట్ల రెన్యువల్ కూడా ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్నారు.