Dare Bioscience | ఇప్పటి వరకు మార్కెట్లో పురుషుల లైంగిక శక్తిని మెరుగుపరిచే ఔషధంగా ‘వయాగ్రా’ అందుబాటులో ఉంది. ఇది మార్కెట్లోకి వచ్చి దాదాపు మూడు దశాబ్దాలు దాటింది. అయితే, మహిళల కోసం అలాంటి ప్రత్యామ్నాయం ఇప్పటివరకు లేదు. ఈ లోటును భర్తీ చేసే దిశగా శాస్త్రవేత్తలు తాజాగా ఒక వినూత్న ఉత్పత్తి తీసుకువచ్చారు. అమెరికాకు చెందిన ‘డేర్ బయోసైన్స్’ సంస్థ మహిళల్లో లైంగిక ఉత్తేజాన్ని పెంచే ప్రత్యేక క్రీమ్‌ను రూపొందించింది. ‘డేర్ టు ప్లే’ అనే పేరుతో విడుదల చేయనున్న ఈ క్రీమ్ కేవలం 10 నిమిషాల్లోనే ప్రభావాన్ని చూపుతుందని కంపెనీ వెల్లడించింది.
ఈ క్రీమ్‌లో వయాగ్రాలో వాడే ‘సిల్డెనాఫిల్’ అనే రసాయనాన్నే వినియోగించారు. దీనిని ప్రైవేట్ భాగాలపై అప్లై చేయడం వల్ల అక్కడ రక్తప్రసరణ మెరుగై, స్పర్శ అనుభూతి పెరగడంతో పాటు లైంగిక ఆసక్తి, కోరికలు బలపడతాయని సదరు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. మహిళల శరీర నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తే సిల్డెనాఫిల్ అత్యంత సమర్థంగా పనిచేస్తుందని తమ పరిశోధనల్లో తేలిందని డేర్ బయోసైన్స్ సీఈఓ సబ్రినా మార్టుక్కీ జాన్సన్ తెలిపారు. 1998లో వయాగ్రా పురుషుల లైంగిక వైద్యంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిందన్న ఆయన.. కానీ, మహిళల విషయంలో దాదాపు 30 ఏళ్లుగా ఎలాంటి పెద్ద పురోగతి జరగలేదని పేర్కొన్నారు.
ఈ క్రీమ్ భద్రత, ప్రభావంపై పలు క్లినికల్ పరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అనుమతుల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కంపెనీ తెలిపింది. సుమారు 200 మంది మహిళలపై చేసిన ప్రయోగాల్లో ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించకుండా, వారిలో లైంగిక ఆసక్తి, కోరికలు, భావప్రాప్తి వంటి అంశాల్లో స్పష్టమైన మెరుగుదల కనిపించిందని వెల్లడించింది. మహిళల కోసం మాత్ర రూపంలో ఔషధాన్ని ఎందుకు తయారు చేయలేదన్న ప్రశ్నకు.. అలా చేస్తే చాలా ఎక్కువ మోతాదులో సిల్డెనాఫిల్ అవసరమవుతుందని, అది ఆచరణీయంగా ఉండదని జాన్సన్ వివరించారు. ప్రస్తుతం అమెరికాలోని 10 రాష్ట్రాల్లో ఈ క్రీమ్‌కు ప్రీ-ఆర్డర్లు తీసుకుంటుండగా, 2026 ప్రారంభానికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.