Munich | బెర్లిన్, ఫిబ్రవరి 19: జర్మన్ దేశ పోలీసులకు ఇప్పుడో కొత్త కేసు సవాల్‌గా మారింది. ఆ దేశంలోని మ్యూనిచ్ నగరంలోని మూడు శ్మశాన వాటికల్లో వేలాది సమాధుల శిలా ఫలకాలు, చెక్క శిలువలపై గుర్తు తెలియని వ్యక్తులు స్టిక్కర్లు అతికించారు. వాటిపై ఎలాంటి గుర్తులు, బొమ్మలు, సూచనలు, నినాదాలు లేకపోవడంతో వాటిని ఎవరు, ఎందుకు ఉంచారో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
పౌరులను భయపెట్టడానికి ఎవరన్నా ఇలా చేశారా? అన్న కోణంలో కూడా పోలీసులు యోచించారు. 5×3.5 సెంటీమీటర్ల సైజులో ఉన్న ఆ స్టిక్కర్లపై ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంది. అయితే దానిని స్కాన్ చేసి చూస్తే ఆ సమాధి ఎవరిది, శ్మశానంలో సమాధి లొకేషన్ వివరాలు మాత్రమే వస్తున్నాయి. ఈ స్టిక్కర్లు అంటించిన వారి గురించి తెలిస్తే వెంటనే తమను సంప్రదించాలని పోలీస్ అధికారి క్రిస్టియన్ డ్రెక్లెర్ పౌరులకు విజ్ఞప్తి చేశారు.