Netanyahu : ఇజ్రాయెల్ ప్రధాని (Israel PM) బెంజామిన్ నెతన్యాహు (Benjamin Netanyah) కు ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) ఫోన్ చేశారు. సరిగ్గా ఆ సమయంలో నెతన్యాహు కీలకమైన సెక్యూరిటీ క్యాబినెట్ మీటింగ్లో ఉన్నారు. గాజాలో కాల్పుల విరమణకు, బందీల విడుదలకు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) 20 సూత్రాల శాంతి ప్రణాళిక కింద కుదిరిన ఒప్పందంపై ఆ సమావేశంలో చర్చిస్తున్నారు. అప్పుడే భారత ప్రధాని మోదీ ఫోన్ చేయడంతో నెతన్యాహు ఆ సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసి ఫోన్ మాట్లాడారు.
ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. భారత ప్రధాని మోదీ తమ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారని, ట్రంప్ 20 పాయింట్ ప్లాన్ కింద గాజాలో కాల్పుల విమరణకు అంగీకరించినందుకు అభినందనలు తెలియజేశారని పేర్కొంది. అదేవిధంగా ప్రధాని మోదీ కూడా ఇజ్రాయెల్ ప్రధానికి ఫోన్ చేసిన విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
‘నేను నా మిత్రుడైన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడాను. ట్రంప్ గాజా పీస్ ప్లాన్ కింద గాజాలో కాల్పుల విరమణకు, బందీల విడుదలకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసినందుకు నెతన్యాహును అభినందించాను. ఆ ఒప్పందాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పాను. గాజా ప్రజలకు ఉపశమనం కల్పించినందుకు ప్రశంసించాను. ఉగ్రవాదం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడైనా, ఏ రూపంలో ఉన్నా ఆమోదయోగ్యం కాదని అతనితో అన్నాను’ అని ప్రధాని తన పోస్టులో పేర్కొన్నారు.