శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 13, 2020 , 13:06:09

నేపాల్‌లో వీసా సేవ‌లు పునఃప్రారంభం!

నేపాల్‌లో వీసా సేవ‌లు పునఃప్రారంభం!

ఖాట్మండు: నేపాల్‌లో‌ నెల రోజుల క్రితం నిలిచిపోయిన వీసా సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నేపాల్ ఇమ్మిగ్రేషన్ విభాగం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం నుంచి అన్ని ర‌కాల‌ వీసా సర్వీసులు యథావిధిగా పనిచేస్తాయని పేర్కొన్న‌ది. నెల రోజుల కింద ఇమ్మిగ్రేషన్ స్టాఫ్ ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వీసా సేవ‌లను నిలిపివేశారు. కాగా వీసా సేవలను తిరిగి ప్రారంభించడంవల్ల నేపాల్‌లో ఉంటున్న విదేశీయులకు ప్రయోజనం చేకూరుతుందని రామ్‌చంద్ర‌ తివారీ అనే అధికారి తెలిపారు. విమానాశ్రయంలో విదేశీయులకు వీసా ఆన్ అరైవల్ సేవలను కూడా అందిస్తున్నట్టు ఆయ‌న పేర్కొన్నారు. 

ఇక ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ సమాచారం ప్రకారం ప్రస్తుతం నేపాల్‌లో 10 వేల మంది విదేశీ పాస్‌పోర్ట్ హోల్డర్లు ఉన్నారు. కరోనా ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని సెప్టెంబర్ 27 వరకు విదేశీయులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా వీసా రెన్యూవల్ చేసుకునే వెసులు బాటు కల్పించినట్లు నేపాల్ ఇమ్మిగ్రేషన్ విభాగం తెలిపింది. సాధారణ పర్యాటక వీసా రుసుం చెల్లించడం ద్వారా డిసెంబర్ 15 వరకు వీసా రెన్యూవల్ చేసుకోవచ్చని పేర్కొన్న‌ది. 

కాగా, నేపాల్ ప్రభుత్వం విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, వివిధ‌ ఏజెన్సీలు, ముందస్తు అనుమతి పొందిన విదేశీయులను సాధారణ విమానాలలో త‌మ దేశానికి రావడానికి అనుమతించింది. అయితే, ముంద‌స్తు అనుమ‌తి లేని, విడిగా వ‌చ్చే విదేశీ పర్యాటకులపై మాత్రం ఆంక్షలు ఇప్పటికీ అమలులో ఉన్నట్లు స్ప‌ష్టంచేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo