Nepal Dy PM | నేపాల్ డిప్యూటీ ప్రధాని రబీ లామిచానేపై సుప్రీంకోర్టు వేటు వేసింది. అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకోకుండా ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో హోం మంత్రి పదవిని కూడా వదిలివేయవలసి ఉంటుంది. గతేడాది డిసెంబరు 14న న్యాయవాదులు యుబరాజ్ పొడెల్, రబీరాజ్ బసౌలా.. రబీ లామిచానేపై కోర్టులో పిటిషన్ వేశారు. అమెరికా పౌరసత్వం వదులుకోకుండానే నేపాలీ పాస్‌పోర్టు పొందినట్లు లామిచానేపై ఆరోపణలు వచ్చాయి.
ద్వంద్వ పౌరసత్వానికి ఉప ప్రధాని రబీ లామిచానే దోషి అని నేపాల్ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పార్లమెంట్ ఎంపీగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. దాంతో డిప్యూటీ ప్రధాని పదవితోపాటు హోంమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నేపాల్‌తో పాటు అమెరికా పౌరసత్వం కూడా కలిగి ఉన్నట్లు రబీ లామిచానేపై ఆరోపణలు వచ్చాయి. నేపాల్‌లో ద్వంద్వ పౌరసత్వం చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. శుక్రవారం ఈ పిటిషన్‌పై నేపాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హరికృష్ణ ఖార్కీ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ప్రకటించింది. కోర్టు తీర్పు రబీ లామిచ్చానేకు వ్యతిరేకంగా రావడంతో డిప్యూటీ ప్రధాని పదవితో పాటు హోంమంత్రి పదవి నుంచి ఆయన దిగిపోనున్నారు.
అంతకుముందు నేపాలీ పౌరుడైన రబీ లామిచానే అమెరికా గ్రీన్ కార్డ్ తీసుకున్నాడు. అమెరికన్ పౌరుడిగా నేపాల్‌కు తిరిగి వచ్చిన ఆయన.. నేపాలీ పౌరసత్వం ఆధారంగా నేపాలీ పాస్‌పోర్ట్ పొందాడు. కాగా, ఇక్కడి చట్టాన్ని అనుసరించకుండానే ఆయన కొత్త పార్టీని స్థాపించాడు. నకిలీ నేపాలీ పౌరసత్వంపై ఎన్నికల్లో పోటీ చేశాడు. ఈయన స్థాపించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) నుంచి 2022 ఎన్నికల్లో పార్లమెంట్‌కు 20 మంది ఎన్నికయ్యారు. తొలి ఎన్నికల్లోనే ఆయన పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషించడంతోపాటు ఎన్నికల్లో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాంతో ఆయనకు ఉపప్రధానితో పాటు హోం మంత్రి పదవిని అప్పగించారు.