Nepal : విదేశీ రెస్క్యూ బృందాలు తమ దేశం వచ్చి సహాయం చేయడానికి నేపాల్ అంగీకరించని సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ విషయంతో నేపాల్ తన నిర్ణయం మార్చుకుంది. విదేశీ సహాయక బృందాలను అంగీకరించాలని నిర్ణయించింది. అయితే, పరిమితంగా మాత్రమే విదేశీయుల్ని అనుమతిస్తామని నేపాల్ పేర్కొంది. బుధవారం నేపాల్‌లో భారీ వరద సంభవించడంతో 600 మంది వరకు మరణించగా, మరో 1,500 మంది వరకు గల్లంతయ్యారు.
వారిని గుర్తించేందుకు నేపాల్ రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ, ఇంకా చాలా మంది ఆచూకీ దొరకలేదు. ఇదే సమయంలో తమ బృందాల్ని సహాయక చర్యల కోసం పంపిస్తామని ఇండియాతోపాటు అమెరికా వంటి దేశాలు చెప్పాయి. అయితే, తమకు ఏ దేశ సహాయం అవసరం లేదని, తమ దేశంలోని రెస్క్యూ బృందాలే ఈ చర్యలు చేపట్టగలవని నేపాల్ తెలిపింది. గాలింపు, సహాయక చర్యల కోసం విదేశాల సాయాన్ని తిరస్కరించింది. అయితే, తమ దేశానికి ఆర్థిక సాయం అందించవచ్చని మాత్రం కోరింది. అది కూడా దేశంలోని సహాయనిధికి అందించాలని సూచించింది.
కానీ, నేపాల్ తమ సాయాన్ని తిరస్కరించడంపై విదేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో అక్కడ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అనుకున్నట్లుగా సహాయక చర్యలు కొనసాగడం లేదు. అక్కడి సిబ్బంది శక్తికి మించిన భారంగా మారింది. పరిస్థితి ఊహించినదానికంటే భిన్నంగా ఉంది. ఘటన జరిగి మూడు రోజులవుతున్నా గల్లంతైన వారిని గుర్తించడంలో నేపాల్ విఫలమైంది. అటు విదేశాల నుంచి సాయం కోసం ఒత్తిళ్లు.. ఇటు సహాయక చర్యలు సరిగ్గా కొనసాగకపోవడంతో నేపాల్ కాస్త వెనక్కు తగ్గింది.
రెస్క్యూ చర్యల కోసం విదేశాలకు అనుమతించింది. ‘‘గాలింపు, సహాయక చర్యల కోసం తమ బృందాలను పంపించేందుకు విదేశాల నుంచి భారీ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని దేశాలకు చెందిన పౌరులు కూడా గల్లంతయ్యారు. తమ వారిని గాలించేందుకు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో అర్హులైన కొందరు నిపుణుల్ని అనుమతిస్తున్నాం’’ అని నేపాల్ ప్రకటించింది. నేపాల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇంకో కారణం ఉంది.
నేపాల్ వరదల్లో గల్లంతైన వారిలో ఇండియాతోపాటు పలువురు చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వంటి దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. వారిని రక్షించడంలో నేపాల్ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు నేపాల్‌పై ఒత్తిడి తేవడంతో, నేపాల్ విదేశీ సహాయక బృందాలకు అనుమతించింది.