కాఠ్మాండు, సెప్టెంబర్ 10: ప్రధాని కేపీ శర్మ ఓలీ సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దె దించిన జనరేషన్ జెడ్ నిరసనకారులు బుధవారం పాలకుల ముందు పలు రాజకీయ, సామాజిక డిమాండ్లను ఉంచారు. దేశ రాజ్యాంగాన్ని పునర్లిఖించడం, గడచిన మూడు దశాబ్దాల పాలకుల అవినీతిపై దర్యాప్తు జరిపించడం వంటివి వారు పెట్టిన డిమాండ్లలో కొన్ని. నిరసనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా అమర వీరులుగా గుర్తిస్తామని, వారి కుటుంబాలకు ప్రభుత్వ గౌరవం, గుర్తింపుతోపాటు సహాయం అందచేస్తామని ఉద్యమకారులు ప్రకటించారు. నిరుద్యోగితను పరిష్కరించడం, వలసలను అరికట్టడం, సామాజిక న్యాయం లభించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని ఉద్యమ నిర్వాహకులు ప్రకటించారు. ఇది ఏ పార్టీ కోసమో వ్యక్తి కోసమో చేస్తున్న ఉద్యమం కాదని, యావత్ తరం కోసం, దేశ భవిష్యత్తు కోసం చేస్తున్నదని వారు ప్రకటించారు. శాంతి అవసరమే కాని కొత్త రాజకీయ వ్యవస్థ పునాదిపైనే అది సాధ్యపడుతుందని నిరసనకారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ ప్రతిపాదనలను నేపాల్ అధ్యక్షుడు, సైన్యం సానుకూల దృక్పథంతో అమలు చేస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.
నిరసనకారుల డిమాండ్లు
కర్ఫ్యూ నీడలో నేపాల్
ప్రధాని ఓలీ రాజీనామా చేసినప్పటికీ నేపాల్వ్యాప్తంగా హింసాకాండ బుధవారం కూడా కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి సైనిక బలగాలు రాజధాని కాఠ్మండుతోపాటు ఇతర నగరాలలోనూ మోహరించాయి. అనేక నగరాలలో సైన్యం నిషేధాజ్ఞలు విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఓలీ ప్రభుత్వం కూలిపోవడంతో నిరసనకారులు పార్లమెంట్‌లోకి ప్రవేశించి నిప్పంటించారు. మంగళవారం రాత్రి నుంచి భద్రతా కార్యకలాపాలను తన అధీనంలోకి తీసుకున్న సైన్యం కాఠ్మాండు, లలిత్పూర్, భక్తాపూర్ నగరాలతోసహా అనేక నగరాలలో నిషేధాజ్ఞలు విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. కొన్ని గ్రూపుల కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసిన సైన్యం క్లిష్ట పరిస్థితిని అవకాశంగా తీసుకుని సామాన్య ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని పేర్కొంది. నిరసన పేరిట హింసాకాండకు పాల్పడితే ఉపేక్షించబోమని సైన్యం హెచ్చరించింది. సాయంత్రం 5 గంటల నుంచి గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపింది.
తెరుచుకున్న విమానాశ్రయం
హింసాత్మక నిరసనలు ప్రజ్వరిల్లిన నేపథ్యంలో మూతపడిన కాఠ్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం 24 గంటల తర్వాత బుధవారం తెరుచుకుంది. కాగా బీహార్‌లోని రక్సాల్ నుంచి నిత్యం నేపాల్‌కు జరిగిన రాకపోకలను భారత ప్రభుత్వం మూసివేసింది. హింసాత్మక ఘటనలలో మరణించిన వారి సంఖ్య 25కి పెరిగినట్లు నేపాల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దాదాపు 633 మంది గాయపడినట్లు తెలిపింది.
అయోధ్యను ప్రశ్నించడమే నా తప్పా?: ఓలీ
పదవీచ్యుతుడైన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ బుధవారం భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. కీలకమైన అంశాలపై భారత ప్రభుత్వాన్ని సవాలు చేసిన కారణంగానే తాను బలవంతంగా పదవి నుంచి తప్పుకోవలసి వచ్చిందని తన పార్టీ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో ఆయన ఆక్రోశించారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు హింసాకాండకు పాల్పడిన దరిమిలా ప్రధాని పదవికి రాజీనామా చేసి ప్రాణరక్షణ కోసం ప్రస్తుతం నేపాల్ ఆర్మీకి చెందిన శివ్‌పురి బ్యారెక్స్‌లో ఓలీ తలదాచుకున్నారు. లిపులేఖ్, అయోధ్య రాముడిపై తాను ప్రశ్నలు లేవనెత్తకపోయి ఉంటే తాను పదవిలో కొనసాగి ఉండేవాడినని ఆయన తెలిపారు. అయోధ్య రాముడి జన్మస్థానం కాదని అన్నందుకే తన పదవి పోయిందని ఆయన పేర్కొన్నారు. 2020 జూలైలో అయోధ్య రాముడిపై ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు భారతీయుడు కాదని ఆయన నేపాలీ అంటూ ఓలీ వాదించారు. శ్రీరాముడి రాజ్యం అయోధ్య నేపాల్‌లోని బీర్‌గంజ్‌కు పశ్చిమాన ఉందని, భారత్ వివాదాస్పద అయోధ్యను సృష్టించిందని ఆయన ఆరోపించారు. బీర్గంజ్ సమీపంలోని తోరీ గ్రామమే అసలైన అయోధ్యగా ఆయన అభివర్ణించారు.
ఆపద్ధర్మ ప్రభుత్వ సారథిగా సుశీలా కర్కీ ?
నేపాల్‌లో కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన దరిమిలా కొత్తగా ఏర్పడనున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి నాయకత్వం వహించే బాధ్యతను నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీకి అప్పగించాలని బుధవారం వర్చువల్‌గా సమావేశమైన 5000 మందికిపైగా జెనరేషన్ జెడ్ ఉద్యమకారులు నిర్ణయించారు. ఆపద్ధర్మ ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి అర్హులైన వ్యక్తుల గురించి వీరంతా ఆన్లైన్లో విస్తృతంగా చర్చించారు. కాఠ్మాండు మేయర్ బలేన్ షా పేరు మొదట్లో బలంగా వినిపించినప్పటికీ తాము పలుమార్లు సంప్రదించడానికి ప్రయత్నించినా ఆయన స్పందించకపోవడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించలేదని జెన్ జెడ్ ప్రతినిధి ఒకరు నేపాలీ మీడియాకు తెలిపారు. తమ ఫోన్ కాల్స్‌ని బలేన్ షా తీసుకోకపోవడంతో ఇతర పేర్లపై చర్చించామని, సుశీలా కర్కీకి అత్యధిక సభ్యుల మద్దతు లభించిందని ఆయన చెప్పారు. ఈ ప్రతిపాదనను ఇదివరకే సుశీలా కర్కీ దృష్టికి తీసుకువెళ్లగా తనకు మద్దతుగా కనీసం 1000 మంది సంతకాలు తీసుకురావాలని ఆమె కోరినట్లు తెలిసింది.
అయితే ఇప్పుడు ఆమెకు మద్దతుగా 2,500కి పైగా సంతకాల సేకరణ జరిగిందని వర్గాలు తెలిపాయి. దేశంలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా 72 సంవత్సరాల సుశీలా కర్కీ నేపాల్ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2016లో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు సుశీలా కర్కీని అప్పటి అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఉపాధ్యాయురాలిగా తన వృత్తిపర జీవితాన్ని ప్రారంభించిన కర్కీ అనంతరం న్యాయవ్యవస్థలోకి ప్రవేశించారు. నిర్భయంగా, సమర్థంగా, అవినీతి రహితంగా ఆమె తన బాధ్యతలు నిర్వర్తించి ప్రజల మన్ననలు అందుకున్నారు.
చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనాలని మంగళవారం ఆర్మీ చీఫ్ అశోక్రాజ్సిగ్దెల్ నిరసనకారులను కోరారు. ప్రసంగిస్తున్న సమయంలో ఆయన వెనుక హిందూ రాజు ఫొటో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మళ్లీ రాచరికం రావాలని పలువురు డిమాండ్ చేస్తున్న క్రమంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.