Nepal | కాఠ్మాండూ, జూలై 6: నేపాల్‌లో స్థిరపడిన భారతీయ వ్యాపారి గతంలో తనను ప్రధానిగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని నేపాల్ ప్రస్తుత ప్రధాని పుష్పకుమార్ దహల్ ప్రచండ చేసిన వ్యాఖ్యలు నేపాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. గత ఆదివారం జరిగిన ‘లోయకు వెళ్లే దారులు: నేపాల్‌పై సర్దార్ ప్రీతమ్ సింగ్ ప్రభావం’ పుస్తకావిష్కరణ సభలో ప్రచండ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రక్కింగ్ వ్యాపారంలో పేరు గాంచిన ప్రీతమ్ సింగ్ భారత్-నేపాల్ సంబంధాలు బలపడటంలో కీలక పాత్ర పోషించారని ప్రచండ ప్రశంసించారు.
‘ఆయన చాలాసార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చి నన్ను ప్రధానిని చేయడానికి ఇక్కడి రాజకీయ నాయకులతో చర్చలు జరిపారు’ అని ప్రచండ అన్నారు. ప్రచండ వ్యాఖ్యలపై గురువారం జరిగిన నేషనల్ అసెంబ్లీ సమావేశంలో ప్రధాన ప్రతిపక్షం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(యూఎంఎల్) భగ్గుమంది. ప్రచండ తన పదవికి రాజీనామా చేయాలని, ఢిల్లీ నియమించిన ప్రధాని తమ దేశానికి వద్దని చెప్పాయి. ఈ నేపథ్యంలో ప్రచండ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. పుస్తకంలో రచయిత చెప్పినదాన్నే తాను ప్రస్తావించానన్నారు.