Airport Closed | నేపాల్ రాజధాని ఖాట్మండు నిరసనలతో దద్దరిల్లుతున్నది. సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా ‘జేన్ జీ’ నేతృత్వంలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనల నేపథ్యంలో ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం సైతం మూసివేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ పరిస్థితుల్లో భారత్ నుంచి నేపాల్‌కు వెళ్లాల్సిన పలు విమానాలు ప్రభావితమయ్యాయి. ఢిల్లీ – ఖాట్మండు మార్గంలో నడుతుస్తున్న మూడు విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. అదే సమయంలో ఢిల్లీ, ముంబయి నుంచి వెళ్లిన విమానాలు ఖాట్మండులో ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. చాలా సమయం పాటు విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. చివరకు అనుమతి ఇవ్వకపోవడంతో విమానాలు తిరిగి లక్నోకు మళ్లించారు. నేపాల్ పౌర విమానయాన అథారిటీ అధికారి జ్ఞానేంద్ర భూల్ మాట్లాడుతూ.. నిరసనకారులు నిప్పుపెట్టడంతో దక్షిణభాగం నుంచి వచ్చే విమానాలు ల్యాండ్ కాలేకపోయాయని చెప్పారు. విమాన ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లయిట్రాడర్24 (Flightradar24) డేటా సైతం.. పలు భారతీయ విమానాలు నేపాల్ మీదుగా చక్కర్లు కొట్టినట్లుగా చూపించింది.
నేపా ప్రభుత్వం ఇటీవల ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించింది. దీనికి వ్యతిరేకంగా వేలాది మంది యువకులు ఖాట్మండు వీధుల్లోకి వచ్చారు. నిరసన హింసాత్మకంగా మారాయి. చివరకు నిరసనకారులు పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టారు. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించారు. భద్రతా దళాలు సైతం రంగంలోకి దిగినా పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోయాయి. పరిస్థితి అదుపు తప్పడంతో సైన్యం సూచన మేరకు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. మరో వైపు భారత రాయబార కార్యాలయం పౌరుల కోసం అత్యవసర హెల్ప్లైన్లను జారీ చేసింది. నేపాల్‌లో అత్యవసర పరిస్థితుల్లో, సహాయం అవసరమైతే వెంటనే సంప్రదించవచ్చని రాయబార కార్యాలయం తెలిపింది. ఈ మేరకు 977-9808602881, 977-9810326134 నంబర్లలో సంప్రదించాలని సూచించింది. అప్రమత్తంగా ఉంటూ.. పరిస్థితిని గమనిస్తూ ఉండాలని రాయబార కార్యాలయం విజ్ఞప్తి చేసింది. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని చెప్పింది.