న్యూఢిల్లీ : మొన్న నేపాల్లోని భోటే కోషె హిమనదిలో మంచుకొండలు విరిగి పడటంతో భవనాలు, బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఇంతకు మించి విధ్వంసం సృష్టించగల 88 అత్యంత ప్రమాదకర హిమానీనదాలు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. పర్వతాల్లో అధిక ఎత్తులో ఉన్న హిమనదులు కరిగినప్పుడు వాటి నుంచి వచ్చే నీరు సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో లేదా రాతి గోడల వెనక చేరుతుంది. క్రమంగా అక్కడ సరస్సు ఏర్పడుతుంది. దీనినే హిమానీనదాలు అంటారు. ఇలాంటి సరస్సులు హిమనదికి ముందు లేదా వెనకభాగంలో ఏర్పడవచ్చు. ఈ సరస్సులోని నీటిని మంచు, రాళ్లు, కొండచరియల మట్టితో ఏర్పడిన ఒక సహజ ఆనకట్టు అడ్డుకుంటుంది. ఏదైనా కారణాలతో ఈ సహజ ఆనకట్ట తెగిపోతే ఆ సరస్సులో ఉన్న లక్షల క్యూబిక్ మీటర్ల నీరు దిగువ ప్రాంతాలను తుడిచిపెట్టేస్తుంది. దీనినే గ్లాసిక్ లేక్ ఔట్రేజ్ బరస్ట్ అంటారు.
ఐఐటీ రోపర్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ నివేదిక ప్రకారం హిమాచల్ ప్రదేశ్లో 88 హిమానీనదాలు చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఇందులో 9 అత్యంత ప్రమాదకరంగా ఉండగా.. 18 అత్యధిక ప్రమాదకరంగా, 26 ప్రమాదకరంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా బియాస్లోని హిమ్సు సరస్సు, సట్లెజ్ బేసిన్లోని పేరుపెట్టని సరస్సు ప్రమాదం గురించి వివరించాయి. హిమ్సు ఆనకట్ట తెగితే సెకనుకు 1,385 క్యూబిక్ మీటర్ల నీటి ప్రవాహంతో వరదలు సృష్టించగలదు. అంటే సెకనుకు 1.4 మిలియన్ల లీటర్ల నీరు కింద ఉన్న ప్రాంతాలను తుడిచిపెట్టేయగలదు. సట్ల్లెజ్ లోని సరస్సు ఆనకట్ట తెగితే సెకనుకు ఏకంగా 3,507 క్యూబిక్ మీటర్ల నీటి ప్రవాహంతో 3.5 మిలియన్ లీటర్ల నీరు కిందికి దూకుతుంది.