కాఠ్మాండు: నేపాల్(Nepal)లో మట్టిచరియలు విరిగిపడడంతో.. త్రిశూలీ నదిలో గత శుక్రవారం రెండు బస్సులు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ బస్సుల్లో మొత్తం 65 ప్రయాణికులు ఉన్నట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రెస్క్యూ సిబ్బంది సుమారు 14 మంది మృతదేహాలను వెలికితీశారు. దాంట్లో 8 మంది మృతదేహాలను గుర్తించారు. ఆ మృతదేహాలను బంధువులకు అప్పగించారు. దీంట్లో ఆరుగురు భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.
కాఠ్మాండుకు 120 కిలోమీటర్ల దూరంలో సిమల్తాల్ వద్ద ఉన్న కీలక హైవేపై రెండు బస్సులు కొట్టుకుపోయాయి. త్రిశూలీ నదిలో ఆ బస్సులు సుమారు వంద కిలోమీటర్ల మేర కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. బస్సుల్లో ఉన్న 65 మంది ప్రయాణికులకు చెందిన పేర్లు, వివరాలను చిత్వాన్ జిల్లా అధికారులు ప్రకటించారు. ఒక బస్సులో 38 మంది, మరో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు.
రెండు బస్సులకు చెందిన ముగ్గురు ప్రాణాలు బయటపడ్డ విషయం తెలిసిందే. పోలీసు, ఆర్మీ దళాలకు చెందిన వందల మంది సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు రెండు బస్సులకు చెందిన ఆనవాళ్లు చిక్కలేదు. నదుల ప్రవాహం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. బురద మట్టిలో బస్సు శిథిలాల చిక్కుకున్నట్లు తెలుస్తోంది.