Sudan Crisis | ఆఫ్రికా దేశం సుడాన్ (Sudan) అల్లర్లతో అట్టుడుకుతోంది. ఆర్మీ, శక్తివంతమైన పారామిలిటరీ బలగాల మధ్య మూడు రోజులుగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వందల మంది ప్రజలు ఆసుపత్రి పాలయ్యారు.
వైమానిక దాడులు, ఫిరంగి దళాల కాల్పులతో సుడాన్ దేశం దద్దరిల్లుతోంది. రాజధానిలోని సైనిక ప్రధాన కార్యాలయం వద్ద భీకరంగా కాల్పులు జరిగాయి. పలుచోట్ల ఇండ్లను దోచుకుంటుండడం, విద్యుత్తు సరఫరాలో అంతరాయం వంటి పరిణామాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో రొట్టెలు, పెట్రోల్ కోసం ప్రజలు బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ ఘర్షణల్లో 200 మంది వరకు మరణించారని, మరో 1800 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి మిషన్ హెడ్ వోల్కర్ పెర్థెస్ (Volker Perthes) చెప్పారు. మరోవైపు సుడాన్ దేశంలో కాల్పులు దేశానికి వినాశకరమని, తక్షణమే కాల్పులు నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ (Antonio Guterres) కోరారు.ఈ దాడుల్లో ఖార్తూమ్ సహా పలు నగరాల్లోని ఆసుపత్రులు దెబ్బతిన్నాయి.
2021 అక్టోబర్లో సైనిక తిరుగుబాటుతో సుడాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పకూలింది. ఈ సైనిక తిరుగుబాటులో సైన్యంతోపాటు పారామిలిటరీ కూడా పాల్గొంది. అయితే, ప్రభుత్వాన్ని కూలదోసిన అనంతరం పారామిలిటరీ గ్రూప్ ‘శీఘ్ర మద్దతు దళం’ (ఆర్ఎస్ఎఫ్)తో సైన్యానికి విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలో ఖార్తూమ్ సహా పలు ప్రాంతాల్లో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు.యుద్ధవిమానాలు, మెషిన్ గన్లు అమర్చిన ట్రక్కులు సహా సాయుధ వాహనాలతో జనసమ్మర్ద ప్రాంతాలపై కాల్పులు జరుపుతుండడంతో సుడాన్లో ఎక్కడ చూసినా భీతావహ దృశ్యాలే దర్శనమిస్తున్నాయి.
Also Read..
Helicopter Raid: సిరియాలో హెలికాప్టర్ రెయిడ్.. ఐఎస్ సీనియర్ నేత హతం
Gurdwara Shootings: గురుద్వారల వద్ద కాల్పులు.. అమెరికాలో 17 మంది అరెస్టు
Anti China: పాకిస్థాన్లో చైనాకు వ్యతిరేకంగా ఆందోళనలు