
కిన్షాసా: ఒక ప్రియమైన గొరిల్లా తన అలనాపాలనా చూసిన సంరక్షుడి ఒడిలో ప్రాణాలొదిలింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్‌లో ఈ విషాదకర ఘటన జరిగింది. 2007లో అటవీ ప్రాంతంలో తల్లి గొరిల్లా మృతదేహం వద్ద ఉన్న రెండేండ్ల పిల్ల గొరిల్లాను ఆ దేశ రేంజర్లు గుర్తించారు. మౌంటెన్ గొరిల్లా సంరక్షణ కేంద్రానికి తరలించిన దానికి ఎన్డకాసిగా పేరు పెట్టారు. ఆండ్రీ బౌమా అనే వ్యక్తి నాటి నుంచి దాని సంరక్షణ బాధ్యతలు చూస్తున్నారు.
2019లో ఆండ్రీతో కలిసి అది దిగిన సెల్ఫీ ఫొటో వైరల్ అయ్యింది. దీంతో ఈ గొరిల్లా పిల్లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో దానితో పలు టీవీ కార్యక్రమాలు, డాక్యుమెంటరీలను చిత్రీకరించారు. విరుంగ అనే డాక్యుమెంటరీలో కూడా ఈ ఆడ గొరిల్లా భాగమైంది.

ఇంత పాపులారిటీ సంపాదించిన 14 ఏండ్ల ఈ గొరిల్లా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. ఇటీవల దాని ఆరోగ్యం మరింతగా క్షిణించింది. దీంతో 14 ఏండ్లుగా తన అలనాపాలన చూసిన ఏకైక స్నేహితుడు, సంరక్షకుడు ఆండ్రీ బౌమా ఒడిలో సెప్టెంబర్ 26న తుదిశ్వాస విడిచింది.
విరుంగా నేషనల్ పార్క్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ‘దశాబ్దానికి పైగా పార్క్‌లోని సెంక్వెక్వే సెంటర్ సంరక్షణలో ఉన్న ప్రియమైన అనాథ పర్వత గొరిల్లా ‘ఎన్‌డకాసి’ మరణాన్ని ప్రకటించడం ఎంతో బాధగా, హృదయవిదారకరంగా ఉన్నది. సుదీర్ఘ అనారోగ్యంతో ఆమె పరిస్థితి వేగంగా క్షీణించింది. సెప్టెంబర్ 26 సాయంత్రం తన సంరక్షకుడు, జీవితకాల స్నేహితుడు ఆండ్రీ బౌమా ప్రేమ పూర్వక చేతుల్లో తుది శ్వాస విడిచింది’ అని అధికార ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.
మరోవైపు ఈ గొరిల్లా సంరక్షకుడు అండ్రీ బౌమా దాని మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ గొరిల్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘ఇలాంటి ప్రేమగల జీవిని సంరక్షించడం ఒక విశేషం. చాలా చిన్న వయస్సులో ఎన్‌డకాసి అనుభవించిన గాయం, బాధను తెలుసుకోవడం మరింత ప్రత్యేకం. దాని మధురమైన స్వభావం, తెలివితేటలు గ్రేట్ ఏప్స్‌తో సంబంధం కలిగి ఉండటానికి ఎంతో సహకరించాయి. మానవులు తమ శక్తి, సామర్థ్యంతో వాటిని ఎందుకు కాపాడాల్సిన అవసరం ఉందో అన్నది అర్థం చేసుకున్నాను’ అని ఆయన తెలిపారు.
ఈ గొరిల్లాను తన స్నేహితుడని చెప్పుకునేందుకు తాను గర్వపడుతున్నానని బౌమా అన్నారు. దానిని ఒక చిన్నారిగా ప్రేమించానని, ఆమెతో సంభాషించిన ప్రతిసారీ తన ముఖంలో చిరునవ్వు వెలిసేదంటూ తన అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.