న్యూఢిల్లీ: నాటో దేశాల్లో(NATO Countries) జనం యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నారు. నార్వే, స్వీడెన్, ఫిన్‌ల్యాండ్ దేశాలు తమ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఒకవేళ సంక్షోభం తలెత్తితే, దాన్ని ఎదుర్కొనేందుకు అన్ని నిత్యావసరాలు స్టాకప్ చేసుకోవాలని ఆయా దేశాల్లో ప్రభుత్వ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ యుద్ధం వచ్చినా.. లేదా ఏదైనా సంక్షోభం వచ్చినా.. దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న రీతిలో అనేక నార్డిక్ దేశాలు తమ ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు స్థానిక మీడియాలు పేర్కొంటున్నాయి.
స్వీడెన్ తమ ప్రజలుకు లక్షల్లో బుక్లెట్లను పంచుతోంది. సంక్షోభం లేదా యుద్ధం వస్తే ఏం చేయాలన్న టైటిల్‌తో ఆ బుక్స్‌ను రిలీజ్ చేసింది. ఈసారి పంచిన కరపత్రాలు భారీ సైజులో ఉన్నట్లు చెబుతున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో పరిస్థితి మరీ క్షీణిస్తోందని, అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్వీడెన్ ఆ కరపత్రాల్లో చెబుతుఉన్నట్లు తెలుస్తోంది. సెక్యూర్టీ పరిస్థితి చాలా భయానకంగా ఉందని, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధంగా ఉండాలని, యుద్ధాన్ని కూడా ఎదుర్కోవాలని స్వీడిష్ సివిల్ కాంటిన్జెన్సీ ఏజెన్సీ డైరెక్టర్ మైఖేల్ ప్రిసెల్ తెలిపారు.
ఇక యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఫిన్‌ల్యాండ్ ఏకంగా ఓ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. సంక్షోభ యుద్ధ పరిస్థితుల్ని ఎదుర్కోనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆ బుక్‌లెట్‌లో చెప్పింది. నార్వేలో కూడా కరపత్రాలను జారీ చేస్తున్నారు. వాతావరణం సరిగా లేకపోయినా.. యుద్ధం వచ్చినా.. ఆ పరిస్థితిని ఓ వారం రోజుల పాటు స్వయంగా ఎదుర్కొనేందుకు రెఢీగా ఉండాలని ఆ కరపత్రంలో తెలిపారు. సంక్షోభం వచ్చినప్పుడు ఎలా దాన్ని ఎదుర్కోవాలన్న రీతిలో ఎక్కువ శాతం మార్గదర్శకాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు తమను తాము కాపాడుకోవాలన్న సందేశాన్ని ఇచ్చారు.
శీతాకాలం కాబట్టి ఒకవేళ విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే, బ్యాకప్ పెట్టుకోవాలని ఫిన్‌ల్యాండ్ సూచించింది. రేడియేషన్ నుంచి తప్పించుకునేందుకు ఐయోడిన్ ట్యాబ్లెట్ దగ్గర పెట్టుకోవాలని పేర్కొన్నది. చాలా ఈజీగా వండుకునే ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని తెలిపింది. ఒకవేళ తమ దేశంపై దాడి జరిగితే, దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న ప్లాన్ కూడా ఫిన్నిష్ ప్రభుత్వం ఇచ్చింది.
సుమారు 72 గంటలకు కావాల్సిన ఆహారం, తాగునీటిని కలిగి ఉండాలని స్వీడన్ తన ప్రతిపాదనల్లో పేర్కొన్నది. ఆలుగడ్డలు, క్యాబేజీలు, క్యారెట్లు, కోడిగుడ్లను నిల్వ చేసుకోవాలని కోరింది. మూడు రోజులకు కావాల్సిన ఆహారం, నీళ్లు, మెడిసిన్ గురించి డెన్మార్క్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ పేర్కొన్నది.