కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 7000 నుంచి 15,000 మంది వరకూ రష్యన్ సైనికులు మరణించారని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) పేర్కొంది. ఉక్రెయిన్ అధికారుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రష్యన్ సైనికుల మరణాలపై ఈ అంచనాకు వచ్చిన నాటో సైనికాధికారి పేర్కొన్నారు.
అణు, రసాయన, జీవాయుధ ముప్పులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు నాటో తగిన పరికరాలు పంపుతుందని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ వెల్లడంచారు. మరోవైపు ఉక్రెయిన్‌కు నాటో సైబర్ సెక్యూరిటీ పరికరాలను అందించడంతో పాటు అణు, రసాయన, జీవాయుధ ముప్పుల నుంచి రక్షణ కల్పిస్తుందని కీవ్ ఇండిపెండెంట్ పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా ఫిబ్రవరి 24న దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇక ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని రష్యాను కోరుతూ శుక్రవారం ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. కాగా, ఉక్రెయిన్ పౌరులపై యుద్ధ నేరాలకు పాల్పడుతున్నదని రష్యాపై అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి. ఐరోపా దేశాలతో పాటు అంతర్జాతీయంగా రష్యాపై ఒత్తిడి పెరుగుతున్నా ఉక్రెయిన్‌పై అణిచివేతను రష్యా కొనసాగిస్తోంది.