వాషింగ్టన్: భారత సంతతి వ్యక్తి, నాసా ఆస్ట్రోనాట్ అనిల్ మీనన్(Astronaut Anil Menon).. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. జూలై 14వ తేదీ కజకిస్తాన్‌లోని బైకనూరు కేంద్రం నుంచి ఆ ఆస్ట్రోనాట్ నింగికి ఎగరనున్నారు. ఉక్రెయిన్, భారతీయ జంటకు మిన్నియాపోలిస్ లో ఆయన జన్మించారు. ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజీషియన్‌గా ప్రాక్టీస్ చేశారు. అమెరికా రోదసి దళంలో కల్నల్‌గా చేశారు. అమెరికా ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న సమయంలో.. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడంలో ఆయన పాల్గొన్నారు. హిమాలయన్ రెస్క్యూ ఆసోసియేషన్ కోసం కూడా పనిచేశారు. మౌంట్ ఎవరెస్టు వద్ద పర్వతారోహకులకు కేరింగ్ చూసుకున్నారు.
అనిల్ మీనన్ వయసు 49 ఏళ్లు. భారత్‌లోనూ ఓ ఏడాది పాటు పనిచేశారు. రోటరీ అంబాసిడర్ స్కాలర్‌గా చేశారు. పోలియో వ్యాక్సిన్ గురించి ఆయన ఇండియాలో స్టడీ చేశారు. రాస్కాస్మోస్కు చెందిన సోయేజ్ ఎంఎస్-29 రాకెట్లో అనిల్ మీనన్ నింగికి ఎగరనున్నారు. అనిల్‌తో పాటు కాస్మోనాట్స్ పైటర్ డుబ్రోవ్, అన్నా కికినా కూడా వెళ్తున్నారు. నాసాలో ఆయన కెరీర్ 2014లో ప్రారంభమైంది. తొలుత ఫ్లయిట్ సర్జన్‌గా చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములతో కలిసి పనిచేశారు. 2018లో స్పేస్ఎక్స్లో చేరారు. అక్కడ మెడికల్ ప్రోగ్రామ్ నిర్వహించారు. మానవ అంతరిక్ష యాత్రకు ఆయన సహకరించారు. మూన్, మార్స్ గ్రహ ప్రయాణాల కోసం రూపొందించిన స్టార్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లోనూ వర్క్ చేశారు.
2021 డిసెంబర్లో నాసా ఆస్ట్రోనాట్‌గా ఎంపికయ్యారు. రెండేళ్ల శిక్షణ చేశారు. మీనన్ భార్య అన్నా విల్హెల్మ్ కూడా ఓ ఆస్ట్రోనాట్. 2024లో ఆమె పోలారిస్ డాన్ వ్యోమనౌకలో అంతరిక్ష ప్రయాణం చేసింది. స్పేస్ఎక్స్ సంస్థ ఈ రాకెట్‌ను పంపిన విషయం తెలిసిందే. స్పేస్ స్టేషన్లో అనిల్ మీనన్ పలు ప్రయోగాలను చేపట్టనున్నారు. సుదీర్ఘ కాలం రోదసి ప్రయాణంలో ఉంటే కలిగే శారీరక మార్పులు, మైక్రోగ్రావిటీ వల్ల రక్తప్రసరణ, ధమనుల పనితీరును ఆయన విశ్లేషించనున్నారు. ఆస్ట్రోనాట్స్ రక్తంలో జరిగే మిశ్రమ ఫలితాలను ఆయన స్టడీ చేయనున్నారు. కొన్ని ఆల్ట్రాసౌండ్ పరీక్షలు కూడా చేపట్టనున్నారు.