Area 51 | లాస్‌వెగాస్: అమెరికాలోని నెవడాలో గల అత్యంత రహస్య ఏరియా 51 మిలిటరీ బేస్‌లో త్రికోణ ఆకారంలోని వింతైన నిర్మాణాన్ని గూగుల్ ఎర్త్‌లో ఇటీవల గుర్తించారు. పొడవైన నీడను కలిగి ఉన్న ఈ టవర్ నిర్మాణ ఉద్దేశంపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మిలటరీ బేస్‌లో ఉన్న ఈ నిర్మాణం లాస్ వెగాస్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గూగుల్ మ్యాప్స్‌లో ఈ నిర్మాణాన్ని వీక్షించవచ్చు. రహస్య సైనిక స్థావరంలో ఉన్న ఈ నిర్మాణాన్ని గ్రహాంతర కార్యకలాపాలకు లేదా గ్రహాంతర జీవులపై పరిశోధనల కోసం నిర్మించి ఉండొచ్చని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని కార్యకలాపాలను చాలా ఏండ్ల నుంచి అమెరికా రహస్యంగా ఉంచడంతో అందులో జరిగే పనులపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.