Elon Musk | న్యూయార్క్, మార్చి 15: 2026లో మార్స్ మిషన్ చేపట్టనున్నట్టు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు, సీఈవో ఎలాన్ మస్క్ వెల్లడించారు. స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన స్టార్‌షిప్ వ్యోమనౌక వచ్చే ఏడాది చివర్లో అంగారకుడిపైకి దూసుకెళ్తుందని తెలిపారు. ఆ వ్యోమనౌకలో టెస్లా సంస్థ అభివృద్ధి చేసిన హ్యూమనాయిడ్ రోబో ‘ఆప్టిమస్’ను కూడా పంపిస్తున్నట్టు వెల్లడించారు. ఆ మిషన్ ల్యాండింగ్ విజయవంతమైతే, 2029 లేదా 2031లో మానవ సహిత యాత్ర చేపడతామని మస్క్ తమ కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలో వెల్లడించారు.
మార్స్ యాత్రపై మస్క్ ఎప్పటినుంచో పని చేస్తున్నారు. అంగారక గ్రహంపై కాలనీల ఏర్పాటు గురించి గతంలోనూ చాలాసార్లు మాట్లాడారు. అంగారక గ్రహంపై స్వయం సమృద్ధి గల మానవ కాలనీలను సృష్టించడం ద్వారా అణు యుద్ధాలు, ప్రకృతి విపత్తులు వంటి ముప్పుల నుంచి మానవ అస్థిత్వాన్ని, నాగరికతను కాపాడుకోవచ్చని ఎన్నోసార్లు చెప్పారు. అందుకు అవసరమైన స్పేస్‌క్రాఫ్ట్, జీవించేందుకు మౌలిక వసతుల కల్పన లాంటి టెక్నాలజీపై స్పేస్ ఎక్స్ పని చేస్తున్నది. అయితే, అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అంగారకుడిపై మానవులను పంపించే మిషన్ తమ మొదటి ప్రాధాన్యం కాదని పేర్కొనడం గమనార్హం.