Mount Etna | ఇటలీ (Italy)లోని సిసిలీ (Sicily)లోని ‘మౌంట్ ఎట్నా’ (Mount Etna) అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో అగ్నిపర్వతం నుంచి బూడిద పెద్ద ఎత్తున ఎగసిపడుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమైన విస్ఫోటనం.. అర్ధరాత్రి మూడు గంటల తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలవడంతో (Mount Etna eruption) పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు (tourists fleeing). ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు అప్రమత్తమైన అధికారులు సమీప గ్రామ ప్రజలను, పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని గంటలుగా అగ్నిపర్వతం నుంచి బూడిద ఎగసిపడుతూనే ఉందని.. ఇలాగే కొనసాగితే మరిన్ని విస్ఫోటనాలు సంభవించే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
#ITALY: New video shows Mount #Etna erupting. pic.twitter.com/zqZHU4FR03
— GRX (@GlobalReportX) June 2, 2025
ఇటలీలోని సిసిలీ తూర్పు తీరంలో ఉన్న ‘మౌంట్ ఎట్నా’ అగ్నిపర్వతం.. ప్రపంచంలోని అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటి. ఈ అగ్నిపర్వతం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇది ఇటలీలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. ఏటా లక్షలాది మంది టూరిస్ట్‌లు దీన్ని సందర్శిస్తుంటారు. ఏడాదికి ఒకసారైనా ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతుందని అక్కడి అధికారులు చెబుతారు. ఎట్నా పర్వతం ఏటా సగటున 14 మిమీ (0.55 అంగుళాలు) చొప్పున మధ్యధరా సముద్రం వైపు కదులుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ అగ్నిపర్వతం 2013లో యునెస్కో వారసత్వ జాబితాలో చోటుదక్కించుకోవడం విశేషం.
Also Read..
India vs USA | అమెరికా దిగుమతులపై రాయితీలను తొలగించనున్న భారత్.. ఎందుకంటే..!
Israel | ఆ కాల్పులు మా పని కాదు.. వాళ్లను చంపింది హమాస్ మిలిటెంట్లే : ఇజ్రాయెల్