Heart Disease | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఒక బిడ్డ తల్లితో పోల్చితే.. కవల పిల్లల తల్లికి గుండె సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం తేల్చింది. కవల పిల్లలకు జన్మనిచ్చిన ఏడాది తర్వాత ఆ తల్లి గుండె జబ్బులబారిన పడే అవకాశముందని పరిశోధకులు తెలిపారు. ప్రసవ సమయంలో అధిక రక్తపోటును కలిగిన తల్లులకు ముప్పు ఇంకా ఎక్కువ ఉంటుందని ‘రట్గర్స్ యూనివర్సిటీ’ (అమెరికా) పరిశోధకులు చెబుతున్నారు. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్’ కథనం ప్రకారం, గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కవల పిల్లల జననాలు పెరిగాయి.
2010-2020 మధ్య అమెరికాలోని దవాఖానాల్లో నిర్వహించిన 3.6 కోట్ల ప్రసవాల డాటాను పరిశోధకులు విశ్లేషించారు. గర్భంలో ఇద్దరు శిశువులు ఉండటం.. తల్లి గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రసవం అనంతరం గుండె పనితీరు మళ్లీ మామూలు స్థితికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుందని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ రూబీ లిన్ చెప్పారు. దీంతో ప్రసవం అనంతరం మొదటి ఏడాది తల్లికి గుండె సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువ ఉంటుందని తెలిపారు.