న్యూఢిల్లీ: అనునిత్యం మనల్ని కుడుతూ ఎంతో చికాకుపెట్టడంతోపాటు పలు రకాల వ్యాధులను సంక్రమింపజేసే దోమలు ప్రపంచానికి గొప్ప వరం లాంటివట. వాటి శృంగాల (యాంటెన్నాల) సాయంతో భూకంపాలు, సునామీల లాంటి ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. వాటిలో ఉండే సాంకేతికత నాయిస్-క్యాన్సిలింగ్ పదార్థాల తయారీకీ ఉపయోగపడుతుందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కంపనాల సున్నితత్వాన్ని అధ్యయనం చేసేందుకు పర్డ్యూ యూనివర్సిటీ పరిశోధకులు దోమల యాంటెన్నాలను పునఃసృష్టించే పనిలో నిమగ్నమయ్యారు. దోమలకు చెవులు లేకపోయినప్పటికీ శృంగాల సాయంతో ధ్వనులను గుర్తించడం ద్వారా పరిసరాలను గమనించగలుగుతాయని, ఇదే తమను ఈ అధునాతన వైజ్ఞానిక పరిశోధనకు పురిగొల్పిందని వారు తెలిపారు.