Morocco Earthquake | మొరాకోలో శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మృతుల సంఖ్య 2వేలు దాటింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. మొరాకోలో 6.8 తీవ్రతతో భూకంపం సభవించింది. భూకంప కేంద్రం మరకేష్కు నైరుతి దిశలో గుర్తించారు. భారీ ప్రకంపనల ధాటికి ఇప్పటి వరకు 2012 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 2059 మంది గాయపడ్డారని మొరాకో ప్రభుత్వం పేర్కొంది. గాయపడ్డవారిలో 1404 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు రాగా.. జనం ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు.
అయితే, ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో 120 ఏళ్లలో ఇంత భారీగా ప్రకంపనలు రావడం ఇదే బలమైన భూకంపమని పేర్కొంటున్నారు. అయితే, క్వారాజాట్, చిచౌవా, అజిలాల్, యూసెఫియా ప్రావిన్స్లతో పాటు మరకేష్, అగాదిర్లో ఎక్కువ ప్రాణనష్టం జరిగినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. భూకంపం సమయంలో జనం పరుగులు తీసిన సమయంలో.. తొక్కిసలాట జరిగింది. ఇప్పటికీ భయాందోళనకు గురవుతున్న జనం వీధుల్లోనే నిద్రిస్తున్నారని స్థానికుడు ఒకరు తెలిపారు. సోషల్ మీడియాలో భూకంప దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. బాధిత ప్రాంతాలకు సహాయం పంపామని మొరాకో ప్రభుత్వం తెలిపింది. రక్తదానం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఫీల్డ్ ఆసుపత్రిని నిర్మించి సైన్యం బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నది. భూకంపంతో మొరాకో తీవ్రంగా నష్టపోయింది. పలుదేశాలు ప్రాణనష్టంపై సంతాపం తెలిపాయి. పలు దేశాలు మొరాకోను ఆదుకునేందుకు ముందుకువచ్చాయి.