లండన్ : బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశవ్యాప్తంగా 100కుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. హీత్రూ, గాట్విక్, మాంఛెస్టర్, బర్మింగ్‌హామ్, కార్డిఫ్, ఎడిన్‌బరో, లండన్ తదితర విమానాశ్రయాల్లో సేవలు నిలిచిపోయాయి. సుమారు 20 నిమిషాల అనంతరం సమస్య పరిష్కారమైనట్లు నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ ప్రకటించింది. విమాన సర్వీసులను పునరుద్ధరించినట్లు తెలిపింది. ఇబ్బందికి గురైన వారందరికీ క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్య పరిష్కారమైనప్పటికీ విమానాల సేవల్లో ఆలస్యాలు తప్పబోవని అధికారులు చెప్పారు.
బుధవారం డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గాల్లో ఉండగా భారీ కుదుపులకు లోనైంది. దీంతో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. విమానాన్ని మినియాపొలిస్-సెయింట్‌పాల్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 275 మంది ప్రయాణికులు, 13 సిబ్బందితో సాల్ట్ లేక్ సిటీ నుంచి ఆమ్‌స్టర్‌డమ్‌కు బయల్దేరిన ఈ విమానం కుదుపులకు లోనుకావడంతో దారి మళ్లించాల్సి వచ్చింది. కుదుపుల వల్ల 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని మినియాపొలిస్-సెయింట్ పాల్ విమానాశ్రయ ప్రతినిధి తెలిపారు. గురువారం న్యూఢిల్లీ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్ నిలిపివేశారు. విమానం బయలుదేరడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. బోయింగ్ కంపెనీకి చెందిన ఈ విమానంలో ఎంతమంది ప్రయాణికులున్నారనే విషయాన్ని ఎయిరిండియా వెల్లడించలేదు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసినట్టు ఆ సంస్థ తెలిపింది.